అమరావతి: వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీటీడీని భ్రష్టు పట్టించిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీడీని వైసీపీ ఆదాయవనరుగా మార్చుకొందన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 52 మందికి పదవులు దేశవ్యాప్తంగా అమ్ముకున్నారని అన్నారు. వెంకన్న స్వామికి భక్తులు సమర్పించిన వెంట్రుకలను వైసీపీ నాయకులు విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపిందని, క్రిమినల్స్‌ను ఆర్ధిక నేరగాళ్లను బోర్డ్‌లో ఆహ్వానితుల పేరుతో వేశారన్నారు. స్వామి వారి విలువైన కానుకలు, ఆస్తులు ఉన్నాయా? లేక అవి కూడా మాయం అయ్యాయా? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు అని... ఇకనైనా భక్తుల మనోభావలను దృష్టిలో పెట్టుకోవాలని బోండా ఉమా హితవుపలికారు.