ఇళ్ల పట్టాల పంపిణీ ముసుగులో అంతులేని అవినీతి: బొండా ఉమ

ABN , First Publish Date - 2020-09-29T18:03:14+05:30 IST

ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అంతులేని అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

ఇళ్ల పట్టాల పంపిణీ ముసుగులో అంతులేని అవినీతి: బొండా ఉమ

అమరావతి: ఇళ్లపట్టాల  పంపిణీ ముసుగులో వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అంతులేని అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రూ.4వేల కోట్ల వరకు దోపిడీ జరిగితే ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐ, ఏసీబీ, సీబీసీఐడీ లేదా మరే సంస్థతోనైనా  విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం చేసేలా టీడీపీ వారు కోర్టుకెళ్లారని వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.


ఏ నియోజకవర్గంలో టీడీపీ వారు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటూ కోర్టు కెళ్లారో ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. ప్రభుత్వంలోని అవినీతిని చూడలేక అధికారపార్టీకి చెందినవారే హైకోర్టుని ఆశ్రయించారని దుయ్యబట్టారు. అనపర్తి నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ, వైసీపీ నేత కత్తి భగవాన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయలేదా? అని..అలాగే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అవినీతిపై కలెక్టర్‌కు లేఖ రాసింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి పేదలకు న్యాయం చేయాలని ఉంటే, టీడీపీ ప్రభుత్వంలో అన్ని జిల్లాల్లో నిర్మించిన ఇళ్లను వారికి ఇవ్వకుండా ఎందుకు పాడుపెట్టిందని నిలదీశారు. ఇళ్లస్థలాల అవినీతి బాగోతంలోని నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు త్వరలోనే టీడీపీ తరుపున నిజనిర్ధారణ కమిటీ వేయబోతున్నామని బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2020-09-29T18:03:14+05:30 IST