అప్పులు చేయడంలో ప్రభుత్వం నెం.1: బీద రవిచంద్ర

ABN , First Publish Date - 2021-12-05T04:20:58+05:30 IST

అప్పులు చేయడంలో వైసీపీ ప్రభుత్వం నెం.1గా నిలిచిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఎద్దేవా చేశారు.

అప్పులు చేయడంలో ప్రభుత్వం నెం.1: బీద రవిచంద్ర
మాట్లాడుతున్న బీద రవిచంద్ర

పోలవరంపై మంత్రి అనిల్‌ వాఖ్యలు సిగ్గుచేటు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద

నెల్లూరు(వ్యవసాయం), డిసెంబరు 4 : అప్పులు చేయడంలో వైసీపీ ప్రభుత్వం నెం.1గా నిలిచిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఎద్దేవా చేశారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లల్లో మూడు లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. అలాగే ఉద్యోగుల పెన్షన్‌ డబ్బులు వాడుకుందని, పంచాయతీల నిధులు దారిమళ్లించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విద్య, వైద్యం కోసం వచ్చిన నిధులను కూడా దారిమళ్లించి వాడుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన బెనిఫిట్స్‌ కంటే ఎక్కువ ఇస్తారనే నమ్మకంతో జగన్‌రెడ్డిని ఉద్యోగస్థులు గెలిపిస్తే వారికి మొండి చేయి చూపించారన్నారు. టీడీపీ తప్పిదం వల్లే పోలవరం డ్యాం ఆలస్యం అయినట్లు వాఖ్యలు చేసినందుకు మంత్రి అనిల్‌ సిగ్గుండాలన్నారు. పట్టిసీమను హేళను చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు దానిపైనే ఆధారపడి పరిపాలన సాగిస్తున్నారని గుర్తుచేశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో రాష్ట్రం గురించి మాట్లాడిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలకు జగన్‌రెడ్డి 6400 కోట్ల నష్టం జరిగిందని నివేదిక ఇచ్చారని అయితే ఖర్చు పెట్టింది కేవలం 34కోట్లని వివరించారు.

సీఎం పరామర్శ, అధికారుల తీరు బాధాకరం: అజీజ్‌

వరదతో ప్రజలు అవస్థలు పడిన పది రోజుల తర్వాత పర్యటకు వచ్చి సీఎం జగన్‌రెడ్డి బాధితులను పరామర్శించిన తీరు, నాయకులు, అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరమని  టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ అన్నారు. ప్రజలతో మమేకమై వెళ్లాల్సిన ముఖ్యమంత్రి అసలు ప్రజలతో సంబంధం లేకుండా పర్యటన చేసి వెళ్లారని విమర్శించారు. పెళ్లికో, ఉత్సవానికో వచ్చి వెళ్లినట్లు ఉందని హేళన చేశారు. జరిగిన నష్టాలను చూపించాల్సిన అధికారులు గ్రీన్‌మ్యాట్‌తో స్వాగతించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదతో గత పదిరోజులుగా రాకపోకలు స్థంభించిన ప్రదేశాలను గాలికొదిలేసిన అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు రాత్రికి రాత్రే మరమ్మత్తులు చేశారన్నారు. ఊళ్లకు ఊళ్లే వరద తాకిడికి కొట్టుకుపోతే కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే ముఖ్యమంత్రి పరిశీలించి ఆయనకు మానవత్వం లేదని నిరూపించుకున్నారని విమర్శించారు. వైసిపి నేతలు పిల్లికి కూడా పిండా కూడు పెట్టని దుర్మార్గులని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపాారు. ఈసమావేశంలో సీటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తాళ్లపాక అనూరాధ, నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, నాయకులు కనపర్తి గంగాధర్‌, జలదంకి సుధాకర్‌, మైనుద్దీన్‌, సాబీర్‌ఖాన్‌, కప్పిర శ్రీనివాసులు, రేవతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-05T04:20:58+05:30 IST