ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి.. రాష్ట్రాన్ని దోచేస్తున్నారు: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-06-16T18:37:21+05:30 IST

అధికారంలోకి వచ్చీ రాగానే క్విడ్ ప్రో కో-2కు జగన్‌రెడ్డి తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి.. రాష్ట్రాన్ని దోచేస్తున్నారు: అచ్చెన్న

అమరావతి: అధికారంలోకి వచ్చీ రాగానే క్విడ్ ప్రో కో-2కు జగన్‌రెడ్డి తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సహ నిందితుల కోసం ‘సర్కారు వారి దొంగలు’ ప్రత్యేక పథకం తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే సరస్వతి సిమెంట్స్ లీజు గడువును పెంచారని...ఇప్పుడు ఇండియా సిమెంట్స్ లీజు గడువును ఏకంగా 50 సంవత్సరాల పెంచారన్నారు. అరబిందోకు కాకినాడ పోర్టు, అంబులెన్సుల కాంట్రాక్టు కట్టబెట్టారని.. హెటిరోకు విశాఖలో బేపార్క్ భూములు దారాదత్తం చేశారని మండిపడ్డారు. రాంకీ ఫార్మా అధినేతను రాజ్యసభకు పంపించారన్నారు. వాన్ పిక్ నిందితుడు నిమ్మగడ్డ కోసం కేంద్ర మంత్రులతో రాయబారాలు నడిపారని దుయ్యబట్టారు. పెన్నా సిమెంట్స్‌కు గనుల లీజును 2035 వరకు పొడిగించారన్నారు. తన కేసుల్లో ఉన్న నిందితులను ఏపీకి రప్పించి మరీ పదవులిచ్చారని విమర్శించారు. రాష్ట్ర సంపదను పప్పు బెల్లాల్లా సహ నిందితులకు పంచుతున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి.. రాష్ట్రాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. క్విడ్ ప్రో కో-1 సహకరించిన ఎంతో మంది జైలుకెళ్లారని..క్విడ్ ప్రో కో-2కు సహకరించే వారికీ అదే గతి తప్పదని గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2021-06-16T18:37:21+05:30 IST