పండుగరోజే భ్రమరాంబ ఆలయంలో చోరీ దురదృష్టకరం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-01-14T19:27:30+05:30 IST

పండుగనాడే గుంటూరు జిల్లాలోని భ్రమరాంబ ఆలయంలో చోరీ జరగడం దురదృష్టకరమని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

పండుగరోజే భ్రమరాంబ ఆలయంలో చోరీ దురదృష్టకరం: అచ్చెన్నాయుడు

అమరావతి: పండుగనాడే గుంటూరు జిల్లాలోని భ్రమరాంబ ఆలయంలో చోరీ జరగడం దురదృష్టకరమని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ దేవాలయంలో చోరీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శించారరు. దేవాలయాలపై దాడులు రాజకీయ క్రీడతో జరుగుతున్నాయని జగన్ రెడ్డి.. కుట్రకోణం లేదని డీజీపీ చెప్పే విధానాన్ని చూస్తే ప్రజలకు అనుమానం కలుగుతోందన్నారు. దాడులు చేసిన నేరస్తులను పట్టుకోకుండా పంచెకట్టుతో దేవాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినంత మాత్రానా జగన్ హిందూ మత పరిరక్షకులు కాలేరని తెలిపారు. దేవుళ్ళకే రక్షణ లేని పాలనలో ప్రజలకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు చేసిన 347 మందిని అరెస్టు చేశామని డీజీపీ అంటున్నారని..దోషులను ప్రజల ముందు ఎందుకు నిలబెట్టలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి, డీజీపీలు ఉన్న ప్రాంతాల్లోనే దేవాలయాలకు రక్షణ లేదంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడి ఇష్టానురీతిగా వ్యవహరిస్తోందన్నారు. రానున్న కాలంలో బడులపై దాడులు ఏ విధంగా చేయాలో ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఉందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-14T19:27:30+05:30 IST