Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి కొడాలికి మతి చలించినట్లుంది..

కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మంత్రి కొడాలి నాని మాటలు వింటుంటే ఆయన మతిస్థిమితం కోల్పోయినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. హైదరాబాదు ఆహ్వానం హోటల్లో టీలు అందించే స్థాయి నుంచి కొడాలిని ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చింది చంద్రబాబే అనే విషయం మరిచినట్లు ఉన్నారని అన్నారు. తన పదవిని నిలుపుకొనేందుకు ఆయన అనునిత్యం చంద్రబాబును విమర్శిస్తూ సీఎం జగన్‌ ఇగోని సంతృప్తి పరుస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పతనానికి నాని, వంశీ, అంబటి రాంబాబు,  ద్వారంపూడి చంద్రశేఖర్‌లు గట్టి పునాదుల వేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం పీఠం దక్కేందుకు భువనేశ్వరి ఏ రోజు పాదయాత్రలు చేయలేదని.. అవినీతి కేసుల్లో జగన్‌ జైలు పాలైనప్పుడు ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిళ పాదయాత్రలు ఎందుకు చేశారో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు మరణం గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు వైఎస్‌ రాజశేఖరెడ్డి, వివేకానందరెడ్డి మరణాల గురించి తాము మాట్లాడితే తట్టుకోగలరా అంటూ నిలదీశారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో నేతలు ఎల్లావుల అశోక్‌యాదవ్‌, బొబ్బిలి రామారావు, బొల్లెద్దు సుశీలరావు, చిలక వెంకటేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement