Abn logo
Jul 25 2021 @ 23:28PM

‘సజ్జల’ వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర

టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తీర్పులు నచ్చకపోతే రివ్యూ పిటిషన్లు వేయాలే తప్ప న్యాయమూర్తులను సాంకేతికంగా సంతృప్తి పరచలేకపోయారన్నారు. అసలు వాస్తవమేమిటో వారికి తెలుసునని బహిరంగంగా మాట్లాడటం న్యాయవ్యవస్థను అవమానపరచటమే అవుతుందన్నారు. ఆర్థికనేరాల కేసుల్లో సీఎం జగన్‌కి జైలుశిక్ష తప్పదన్న భయంతో సజ్జల, విజయసాయిరెడ్డి ఒక పద్ధతి ప్రకారం న్యాయస్ధానాలపై ప్రజల్లో అనుమానాలు, అపోహలు రేకెత్తించేవిధంగా పక్కాప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు.


జగన్‌ తప్పుచేయలేదని కోర్టులే కావాలని ఇబ్బందులు పెడుతున్నాయన్న భావన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పులివెందుల మాఫియా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేసిందన్నారు. మరోవైపు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు మిస్టరీ వీడేందుకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ అగ్రనేతల వెన్నుల్లో వణుకు మొదలైందన్నారు. సీఎం పీఠంకోసం హైదరాబాద్‌‌లో మరణహోమం సృష్టించింది వైఎస్‌ కుటుంబమేనని, ఇప్పుడు జగన్‌ క్యాబినెట్‌లో కీలకంగా ఉన్న అప్పటి కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడిన మాటలు నిజం కాదా అని ప్రశ్నించారు. సజ్జల ఎన్ని జాకీలేసి ఎత్తినా చంద్రబాబు ముందు జగన్‌ మరుగుజ్జు మాత్రమేన్నారు. చంద్రబాబుకి జగన్‌కి ఆదిశంకరాచార్యుడికి, ఆటో శంకర్‌కి ఉన్నంత తేడా ఉందన్న విషయాన్ని సజ్జల ఎప్పటికి మర్చిపోగూడదన్నారు.


చంద్రబాబు అక్రమంగా తన సామాజికవర్గానికి చెందిన 30మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు కల్పించారని ప్రజలను నమ్మించిన జగన్‌ మాఫియా, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఈరోజు వరకు ఆ జీవోని బయటపెట్టకపోవటం సిగ్గుచేటన్నారు. న్యాయవ్యవస్థను రోడ్డుపైకి లాగుతున్న సజ్జలపై సుమోటోగా కేసు నమోదుచేసి వెంటనే అరెస్టు చేయాల్సిందిగా కనపర్తి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.