జగన్ కుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం: మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2022-05-22T01:26:49+05:30 IST

సీఎం జగన్‌ కుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ (Buggana Rajendranath) తప్పుబట్టారు.

జగన్ కుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం: మంత్రి బుగ్గన

అమరావతి: సీఎం జగన్‌ కుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ (Buggana Rajendranath) తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ దావోస్‌ పర్యటనపై నిస్సిగ్గుగా మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. యనమలవి దిగజారుడు రాజకీయాలని తప్పుబట్టారు. సీఎం దావోస్‌ పర్యటన రహస్యమేమీ కాదన్నారు. శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరిన తర్వాత.. సీఎం విమానం ఇంధనం కోసం ఇస్తాంబుల్‌లో ఆగిందని తెలిపారు. ఎయిర్‌ట్రాఫిక్‌ ఉండడంతో ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యమైందని చెప్పారు. దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టు (London Airport)కు చేరుకునేసరికి ఇంకా ఆలస్యమైందన్నారు. లండన్‌లో కూడా ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉందని, జురెక్‌లో ల్యాండవడానికి షెడ్యూల్‌ సమయం దాటిందని పేర్కొన్నారు. 


మళ్లీ ల్యాండింగ్‌ కోసం అధికారులు రిక్వెస్ట్‌ పెట్టారని, ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు పాల్గొన్నారని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాల ల్యాండింగ్‌ నిషేధమని, భారత ఎంబసీ అధికారులకు స్విస్‌ అధికారులు నివేదించారని చెప్పారు. వారు నేరుగా సీఎం వెంట ఉన్న అధికారులతో చర్చించి.. లండన్‌లోనే సీఎం జగన్‌కు బస ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెల్లవారుజామునే జురెక్‌ బయల్దేరేందుకు సీఎం బృందం సిద్ధంగా ఉన్నా.. డీజీసీఏ రూల్స్‌ ప్రకారం పైలెట్లకు నిర్ణీత గంటలు విశ్రాంతి తీసుకోవాలనే నింబంధన ఉందని పేర్కొన్నారు. నిజాలు ఇలా ఉంటే..సీఎంపై అసూయతో టీడీపీ (TDP) దుష్ప్రచారం చేస్తోందని బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు.

Updated Date - 2022-05-22T01:26:49+05:30 IST