టీడీపీ సరికొత్త వ్యూహం

ABN , First Publish Date - 2022-01-17T05:14:56+05:30 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ జిల్లాలో సరికొత్త వ్యూహాన్ని అమలు వేస్తోంది. నియోజకవర్గం యూనిట్‌గా పార్టీ నిర్మాణ నాయకత్వ సమస్యలకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో మాదిరి వేచిచూసే ధోరణికి అతీతంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.. ఎర్రగొండపాలెంలో ఒకరిద్దరు నాయకులు లేవనెత్తిన సమస్యలకు తక్షణం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. అక్కడ ఇన్‌చార్జిగా ఎరిక్షన్‌బాబును నియమించిన తర్వాత కొందరు పార్టీ నిర్ణయాన్ని పక్కదారి పట్టించేలా ప్రచారం చేశారు.

టీడీపీ సరికొత్త వ్యూహం

ముగ్గురు ఎమ్మెల్యేలకు బాధ్యతల విభజన

కీలకనేతగా మారిన గొట్టిపాటి 

ఒంగోలులో నాయకుల మధ్య

విభేదాలపై అధిష్ఠానం ఆరా

చీరాల కోసం ప్రత్యేక కార్యచరణ

కందుకూరులో తొందరపడకూడదని నిర్ణయం

దర్శి గెలుపుతో కందుకూరు, పొదిలి 

మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి

ఒంగోలు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  టీడీపీ జిల్లాలో సరికొత్త వ్యూహాన్ని అమలు వేస్తోంది. నియోజకవర్గం యూనిట్‌గా పార్టీ నిర్మాణ నాయకత్వ సమస్యలకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో మాదిరి వేచిచూసే ధోరణికి అతీతంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.. ఎర్రగొండపాలెంలో ఒకరిద్దరు నాయకులు లేవనెత్తిన సమస్యలకు తక్షణం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. అక్కడ ఇన్‌చార్జిగా ఎరిక్షన్‌బాబును నియమించిన తర్వాత కొందరు పార్టీ నిర్ణయాన్ని పక్కదారి పట్టించేలా ప్రచారం చేశారు. దీంతో అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్‌ ఇద్దరూ జోక్యం చేసుకొని అక్కడ పోటీ చేసే అభ్యర్థి  ఎరిక్షణబాబే అని  లోక్‌సభ పార్టీ ఇన్‌చార్జి ద్వారా ప్రకటింపజేశారు. మిగిలిన నియోజకవర్గాల విషయంలోనూ ప్రత్యేక కార్యారణతో ముందుకు వెళ్తున్నారు. 

చీరాల, కందుకూరుపై ప్రత్యేక దృష్టి 

ప్రస్తుతం పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జిలు లేని చీరాల, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో తాజా పరిస్థితికి అనుగుణంగా టీడీపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. చీరాలలో పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న యడం బాలాజీ ఇటీవల వైసీపీలోని మంత్రి బాలినేని, ప్రత్యేక సలహాదారు సజ్జలకు టచ్‌లో ఉన్నారన్న అభియోగాలను కొందరు మోపారు. అలాగే నారా లోకేష్‌ బృందంలో ఒకరిగా ఉండే ఆ నియోజకవర్గానికి చెందిన వారు బలరాంనకు అనుగుణంగా వ్యవహరిస్తూ పార్టీకి ప్రత్యేకించి బాలాజీకి వ్యతికేకంగా తప్పుడు సమాచారాలు ఇస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో నిజానిజాలు తేల్చే పనిలో అధిష్ఠానం పడింది. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కొన్ని గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి కొన్ని క్లస్టర్లను పర్యవేక్షించేందుకు కొందరు నాయకులను నియమించి తద్వారా పార్టీ నిర్మాణానికి సంబంధించి అండర్‌ గ్రౌండ్‌ పని ప్రారంభించారు.  కందుకూరు విషయంలో ప్రస్తుతం అక్కడ పార్టీ కార్యక్రమాల నిర్వాహణలో చురుగ్గా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే శివరాం, యువనాయకులు రాజేష్‌ తదితరులను పరిగణలోకి తీసుకున్నారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వం అనేక విధాల ఇబ్బందులకు గురిచేసినా, ఆరోగ్య సమస్యలు ఎదురైనా పార్టీని వీడని మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకూ ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా ఇటీవల రామారావును చంద్రబాబు పిలిపించుకొని మాట్లాడారు. తదనంతరం కారణాలు ఏమైనప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జి నియామక విషయంలో అధిష్ఠానం వెనుకడుగు వేసింది. మరికొంత కాలం వేచిచూడాలన్న ఆలోచనతో జిల్లాలోని లోక్‌సభ నియోజకవర్గాల స్ధాయి పార్టీ పరిశీలకులతో కలిసి స్ధానికంగా ఎక్కువమంది నాయకులతో కమిటీ ఏర్పాటు చేశారు.  

ఒంగోలు నేతల విభేదాలపై ప్రత్యేక ఆరా 

 ఒంగోలు లోక్‌సభ పార్టీ వ్యవహారాల్లో చోటుచేసుకున్న కొన్ని అంశాలపై అధినేత చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలచిన కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ఒంగోలు లోక్‌సభ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జన్దాన్‌ జోక్యం, సామాజికవర్గాల సమతూకంలో భాగంగా బీసీ వర్గానికి చెందిన నూకసాని బాలాజీని ఒంగోలు లోక్‌సభ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌, బాలాజీల మధ్య సఖ్యత కొరవడింది. లోక్‌సభ పరిధిలోని కొందరు ఇన్‌చార్జిలు దామచర్లకు మద్దతుగా నిలవటంతోపాటు బాలాజీని మార్పు చేయాలని డిమాండ్‌ పెట్టారు. మరికొందరు బీసీ వర్గానికి చెందిన బాలాజీని మార్చటం సమంజసం కాదన్న వాదన లేవనెత్తారు. తదనుగుణంగా ఎవరివాదన వారు అటు చంద్రబాబు, ఇటు లోకేష్‌కు వివరించారు. ఈ విషయంలో అధిష్ఠానం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ప్రత్యేక దూతల ద్వారా సమాచారం సేకరిస్తోంది. 

దర్శి స్ఫూర్తితో కమిటీలు 

దర్శి నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించింది. దాన్ని పరిగణలోకి తీసుకున్న అదిష్ఠానం భవిష్యత్‌లో ఎన్నికలు జరగాల్సిన కందుకూరు మున్సిపాలిటీ, పొదిలి నగర పంచాయతీల విషయాల్లో ప్రత్యేక చర్యలు  చేపట్టింది. రాష్ట్ర నాయకుల పర్యవేక్షణలో కందుకూరు నియోజకవర్గానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటమే కాక పొదిలి విషయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, స్థానిక నాయకులతో కలిపి చర్చించి ఎవరి బాధ్యతలు వారికి అప్పగించారు. 

ముగ్గురు ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు : జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఏలూరి సాంబశివరావు (పర్చూరు), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి), బాలవీరాంజనేయస్వామి (కొండపి)లకు ప్రత్యేక బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. అవసరమైన సందర్భాల్లో ముగ్గురు సమిష్టి అభిప్రాయాన్ని అదిష్టానం పరిగనలోకి తీసుకుంటూ ముందగుడు  వేస్తోంది.

కీలకంగా మారిన గొట్టిపాటి 

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అభిప్రాయాలను అనేక సందర్భాల్లో పార్టీ అధినేత చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శి నగర పాలక ఎన్నికల సందర్భంలోనూ, ఒకట్రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల నియామకాల్లోనూ రవికుమార్‌ సూచనలను పరిగణలోకి తీసుకోవడం కనిపించింది. పార్టీ శ్రేయోభిలాషులైన తటస్థ వాదులను.. ప్రత్యేకించి ప్రవాసాంధ్రులు పలువురును రవికుమార్‌ అధినేత చంద్రబాబుతో కలిపినట్లు కూడా సమాచారం. భవిష్యత్‌ పార్టీ రెండు జిల్లాలకు ఒక ఇన్‌చార్జిని నియమించే విషయంలో కూడా రవికుమార్‌ సూచనలకు అనుగుణంగా ప్రకాశం నెల్లూరు జిల్లా ఇన్‌చార్జిలను నియమించాలనే ఆలోచనలకు వచ్చినట్లు తెలుస్తోంది.  

Updated Date - 2022-01-17T05:14:56+05:30 IST