పెద్దాపురం: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు వినూత్న నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఎడ్ల బండికి కారును తాడుతో కట్టి పట్టణంలో తిప్పారు. అంతేకాకుండా కారుకు తాళ్ళను కట్టి టీడీపీ కార్యకర్తలు లాగుతూ తమ నిరసనను తెలియజేశారు. నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంద్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారని ఆరోపించారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ పెరిగాయని గగ్గోలు పెట్టారని, మరి ఇప్పుడు వాటి ధరలను జగన్ భారీగా పెంచారని ఆయన దుయ్యబట్టారు. రెండేళ్లలో ఏపీలో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలపై వెయ్యి కోట్ల రూపాయల మేర టాక్స్ వసూలు చేశారని చినరాజప్ప ఆరోపించారు. దీంతో ప్రజలపై పన్నుల భారం పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో చంద్రబాబు ప్రజల బాధలను అర్థం చేసుకుని 12 వందల కోట్ల టాక్స్ భారం ప్రజలపై పడకుండా చూసారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై భారం పడుతుందని తెలిసినా అప్పట్లో చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారని రాజప్ప అన్నారు. మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేస్తే, జగన్ గ్యాస్ ధరలను పెంచి మహిళల కళ్లల్లో కన్నీరు తెప్పిస్తున్నారన్నారని చినరాజప్ప విమర్శించారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతి మార్చుకోవాలన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్‌లను తగ్గించాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.