సీబీఐ విచారణకు సిద్ధం

ABN , First Publish Date - 2022-06-28T05:20:12+05:30 IST

మాచర్ల నియోజకవర్గంలో తెలంగాణ మద్యం, గ్రానైట్‌ లారీలు చెక్‌పోస్టు దాటించడం, నాటుసారా అమ్మించడం, జరుగుతున్న హత్యలు, అక్రమాలు అన్నింటిపై సీబీఐ విచారణ వేయించి దోషులను తేల్చడానికి సిద్ధంగా ఉన్నానని, ఎమ్మెల్యే పీఆర్కే సీబీఐను కోరాలని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్‌ విసిరారు.

సీబీఐ విచారణకు సిద్ధం
సమావేశంలో మాట్లాడుతున్న బ్రహ్మారెడ్డి

ఎమ్మెల్యే పీఆర్కేకు బ్రహ్మారెడ్డి సవాల్‌ 

కారంపూడి, జూన్‌ 27: మాచర్ల నియోజకవర్గంలో తెలంగాణ మద్యం, గ్రానైట్‌ లారీలు చెక్‌పోస్టు దాటించడం, నాటుసారా అమ్మించడం, జరుగుతున్న హత్యలు, అక్రమాలు అన్నింటిపై సీబీఐ విచారణ వేయించి దోషులను తేల్చడానికి సిద్ధంగా ఉన్నానని, ఎమ్మెల్యే పీఆర్కే సీబీఐను కోరాలని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్‌ విసిరారు. సోమవారం మధ్యాహ్నం కారంపూడిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్కో గ్రానైట్‌ లారీ మాచర్ల సరిహద్దు చెక్‌పోస్టు దాటించినందుకు ఎమ్మెల్యే పీఆర్కే లారీకి రూ. 25 వేలు తీసుకుంటున్నారని, ఒక్కో లారీ రూ. 1.65 లక్షల జీఎస్టీ ఎగవేస్తుందని అన్నారు. ఆదివారం మాచర్లలో వైసీపీ ప్లీనరీ నిర్వహించి ఆటవిక భాషను ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడారన్నారు. నియోజకవర్గ నేత, శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాష అదేనా అని ప్రశ్నించారు. ఎక్కడైనా ప్లీనరీ సమావేశం నిర్వహిస్తే పార్టీ విధి విధానాల గురించి వివరిస్తారని, ఈ పీఆర్కే ప్లీనరీలో ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీ లేదని అన్నారు. ప్రతిసారి వెన్నుపోటు అని చంద్రబాబును అనడంపై ముందుగా తన వీపు తాను చూసుకోవాలని అన్నారు. మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి లక్ష్మారెడ్డిని వెన్నుపోటు పొడిచి సీటు తెచ్చుకున్నారని, గత ఎన్నికల్లో సాక్షాత్తు లక్ష్మారెడ్డి ఈ విషయం అన్నారని చెప్పారు. జగన్‌కి, వైఎస్‌ఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ భిక్ష పెడితే తల్లి లాంటి కాంగ్రెస్‌ పార్టీని వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. కన్నతల్లి విజయమ్మ వైజాగ్‌లో ఓడిపోతే కుటుంబం నుంచి వెలివేసేలా చేశారని, కనీసం రాజకీయంగా ఆమెకు ప్రాధాన్యం లేకుండా జగన్‌ చేశారని అన్నారు. నియోజకవర్గంలో పాసు పుస్తకం కావాలంటే రూ. 15 వేలు వైసీపీ నేతలకు ముట్టజెప్పాల్సి వస్తోందని, చివరకు కరోనా వ్యాక్సిన్‌ కూడా వైసీపీ నేతలు అమ్ముకున్నారని అన్నారు. సత్తెనపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన కోడెల విగ్రహ ప్రతిష్టలో ఓర్వలేక వైసీపీ నేతలు గలాటా సృష్టించారని, ఇది ఇంతకు ముందు ఏ ప్రభుత్వంలో జరగలేదని, కేవలం వైసీపీలో మాత్రమే జరిగిందని అన్నారు. తనకు ఇల్లు లేదని, కట్టుకునేందుకు దుస్తులు లేవని, పెయిడ్‌ ఆర్టిస్ట్‌ని అంటూ ఎగతాలి చేస్తున్నారని, నాకు అక్రమ సంపాదన ఇష్టం లేకనే నీ లాగా భవనం మీద భవనం కట్టలేదని అన్నారు. నేను నియోజకవర్గానికి వచ్చిపోయే వాణ్ణని అంటున్నారని, తన తల్లి దుర్గాంభ శాసనసభ్యురాలిగా గెలిచి ఎంత సేవ చేశారో అందరికీ తెలుసని అన్నారు.  తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని అన్నారు.  తాను భయపడేది లేదని, నియోజకవర్గ ప్రజలు ఉన్నారని, వారి అభిమానం చాలన్నారు.  ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పంగులూరి అంజయ్య, మాజీ అధ్యక్షుడు చప్పిడి రాము, మాజీ ఉప ఎంపీపీ పంగులూరి పుల్లయ్య, జిల్లా అధికార ప్రతినిధి గోళ్ల సురేష్‌యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ, కార్యదర్శి తోట నరసింహారావు, తండా మస్తాన్‌జానీ, షేక్‌ జానీబాషా, దోర్నాల బ్రహ్మారెడ్డి, నరసింహారెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్‌ దొడ్డా వెంకటనారాయణ, ఒప్పిచర్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:20:12+05:30 IST