పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ

ABN , First Publish Date - 2020-10-01T09:37:50+05:30 IST

త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని, ఓటర్ల నమోదులో కార్యకర్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ

పార్టీ వరంగల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు చిటూరి అశోక్‌ 


హన్మకొండ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని, ఓటర్ల నమోదులో కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని ఆ పార్టీ వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చిటూరి అశోక్‌ పిలుపునిచ్చారు. హన్మకొండ భవానీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం పార్టీ వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం అశోక్‌ అధ్యక్షతన జరిగింది. ఈనెల 1 నుంచి నవంబర్‌ 6 వరకు పట్టభద్రుల ఓటరు నమోదు, టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్న ముంజ వెంకట్రాజం గౌడ్‌ను పోటీలో నిలపాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరాలని సమావేశం తీర్మానించింది.


అలాగే ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్‌ టీడీపీ నాయకుడు బాస్కుల ఈశ్వర్‌ కుటుంబానికి  పార్టీ అండగా నిలవాలని, డిగ్రీ పూర్తి చేసిన ప్రతిఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా కార్యకర్తలు ప్రోత్సహించాలని, పార్టీ బలోపేతానికి అందరూ కృషిచేయాలని సమావేశంలో తీర్మానించారు. చిటూరి అశోక్‌ మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం రాబోతోందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాటోతు ఇందిర, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముంజ వెంకట్రాజం గౌడ్‌, శ్రీశైలం బోర్డు మెంబర్‌, వరంగల్‌ పార్లమెంట్‌ ఉపాఽధ్యక్షుడు జీఎల్‌.శ్రీధర్‌, షేక్‌ బాబాఖాదర్‌అలీ, పార్టీ సీనియర్‌ నాయకులు  శ్రీరాముల సురేష్‌, కుసుమ శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T09:37:50+05:30 IST