కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ దూకుడు

ABN , First Publish Date - 2021-03-01T05:44:30+05:30 IST

కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ దూకుడు పెంచింది..

కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ దూకుడు

చాపకింద నీరులా నాయకుల వ్యూహాలు

కర్నూలులో బాలకృష్ణ పర్యటనకు సన్నాహాలు

డోన్‌లో రీ నోటిఫికేషన్‌కు టీడీపీ పట్టు

వైసీపీ బెదిరింపులపై ఎస్‌ఈసీకి ఫిర్యాదులు

విభేదాలతో సతమతమవుతున్న వైసీపీ


కర్నూలు, ఆంధ్రజ్యోతి: కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ దూకుడు పెంచింది. కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల్లోని 52 డివిజన్లపై పట్టు బిగించింది. కర్నూలు మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. టీడీపీ అభ్యర్థులకు రెండ్రోజుల క్రితమే బీ ఫారాలు అందజేసింది. దీంతో అభ్యర్థులు ప్రచారాలతో జోరు మీదున్నారు. కర్నూల్లోని 17వ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థికి టీడీపీ మద్దతునిస్తోంది. 4వ తేదీ నుంచి వరుస ర్యాలీలు, రోడ్‌ షోలకు ప్రణాళికలను రచిస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కర్నూలు లోక్‌సభ పరిధిలో పర్యటింపజేసేందుకు టీడీపీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి షాక్‌ తప్పదని భావిస్తున్నాయి. ఇప్పటికే వర్గ విభేదాలు, రెబల్స్‌ బెడదతో ఆ పార్టీ కుదేలవుతోంది. వైసీపీ తరపున బీవై రామయ్య మేయర్‌ అభ్యర్థిగా ప్రచారం సాగిస్తున్నారు. డోన్‌లో ఆర్థిక మంత్రి బెదిరింపులు, ఒత్తిళ్లతో గత ఏడాది టీడీపీ అభ్యర్థులు నామినేషన్లకు వెనకడుగేశారని, ఆ మునిసిపాలిటీలో రీ-నోటిఫికేషన్‌ జారీ చేయాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎస్‌ఈసీకి శనివారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆళ్లగడ్డ మునిసిపాలిటీపైనా ఎస్‌ఈసీకి ఫిర్యాదులు అందాయి.


కర్నూలు పరిధిలోని 33 డివిజన్ల బాధ్యతలు టీజీ భరత్‌, కల్లూరు పరిధిలోని 16 వార్డులను గౌరు వెంకటరెడ్డి, కోడుమూరు పరిధిలోని 3 వార్డుల బాధ్యతలను రాజా విష్ణువర్ధన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఆ పార్టీ ఏర్పాటుచేసిన కర్నూలు నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం కార్యకర్తల్లో జోష్‌ నింపింది. ఈ సమావేశంలో కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, కేఈ ప్రభాకర్‌, టీజీ భరత్‌, గౌరు చరిత ఇలా అన్ని నియోజకవర్గాల నాయకులు కలిసి ఎన్నికల ముందు సమావేశం నిర్వహించడం కలిసొచ్చే అంశమని భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, పనితీరుతో పాటు 4వ తేదీ నుంచి నిర్వహించే కార్యక్రమాలపై కార్యకర్తలతో చర్చించారు. 


ఒక్కో వార్డులో ముగ్గురి కంటే ఎక్కువ

పేరుకు అధికార పార్టీనే అయినా వైసీపీ వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. కర్నూలులో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలోపలువురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఒక్కో వార్డులో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. అయితే ఎమ్మెల్యే హఫీజ్‌ బీ-ఫారం అందించే అభ్యర్థులే పోటీలో ఉంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కర్నూలు పరిధిలోని 33 డివిజన్లకు 13, 22, 24, 41, 42, 51, 50, 52 వార్డుల్లో హఫీజ్‌ఖాన్‌ ప్రచారం చేశారు. దీంతో ఆ డివిజన్లలో అభ్యర్థులు ఖరారైనట్లేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. 


బాలకృష్ణ రాక?

కర్నూలు లోక్‌సభ పరిధిలోని కర్నూలు, గూడూరు, ఆదోని, ఎమ్మిగనూరు మునిసిపాలిటీల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించే అవకాశాలున్నాయి. పర్యటన తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు రోజుల పాటు బాలకృష్ణ పర్యటించే నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు టీడీపీ పెద్దలు శ్రీకారం చుట్టారు. ఆ పర్యటనకు ముందే మార్చి 4వ తేదీన కర్నూలులో ఒక భారీ రోడ్‌ షోకు టీడీపీ సిద్ధమవుతోంది. బైక్‌ ర్యాలీతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల నడుమ వందలాది మంది కార్యకర్తలతో ఈ రోడ్‌ షోను సోమిశెట్టి వెంకటేశ్వర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే 2వ తేదీన నంద్యాల చెక్‌పోస్టు నుంచి సుమారు కిలోమీటరు పొడవున మరో భారీ రోడ్‌ షోకు కూడా నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాలకృష్ణ పర్యటన తేదీ ఖరారును బట్టి మిగిలిన రోడ్‌ షోలను సిద్ధం చేస్తామని సోమిశెట్టి వివరిస్తున్నారు. 


సత్తా చాటుతాం: సోమిశెట్టి వెంకటేశ్వర్లు

ఎన్నికల్లో విజయమే తప్ప మేయర్‌ అభ్యర్థి ప్రకటనకు మేము ప్రయత్నించడంలేదు. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నాం. వైసీపీ అరాచకాలకు కార్పొరేషన్‌ ఎన్నికల నుంచే గండి కొడతాం. కర్నూలు పరిధిలోని 52 వార్డుల్లో టీడీపీ సత్తా చాటుతాం. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పరిస్థితి అధ్వానంగా తయారైంది. టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తే వైసీపీకి ఓటమి తప్పదనే నిశ్చయానికి వచ్చారు. అందుకే డోన్‌లో టీడీపీ నామినేషన్లు వేయకుండా భయాందోళనలు సృష్టించారు. దీనిపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశాం. కచ్చితంగా అక్కడ రీ-నామినేషన్ల నుంచి ఎన్నికలు జరగాలి. ఆళ్లగడ్డలోనూ టీడీపీ అభ్యర్థులపై బెదిరింపుల పర్వానికి ఎమ్మెల్యే వర్గీయులు తెరతీస్తున్నారు. 

Updated Date - 2021-03-01T05:44:30+05:30 IST