వైసీపీ పాలనలో గిరిజనులకు తీరని అన్యాయం

ABN , First Publish Date - 2022-08-10T06:11:08+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు తీరని అన్యాయం చేస్తోందని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.

వైసీపీ పాలనలో గిరిజనులకు తీరని అన్యాయం
సేవాలాల్‌ మహరాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జీవీ ఆంజనేయులు

జీవీ ఆంజనేయులు  

వినుకొండటౌన్‌, ఆగస్టు 9: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు తీరని అన్యాయం చేస్తోందని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా బొల్లాపల్లి మండలం టీడీపీ అధ్యక్షుడు జరపాల గోవిందునాయక్‌ అధ్యక్షతన వినుకొండ టీడీపీ కార్యాలయంలో సేవాలాల్‌ మహరాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం  మాట్లాడుతూ టీడీపీ పాలనలో గిరిజనులకు సంక్షేమ పథకాలు, రాయితీలు కల్పించి ఆదుకున్నట్లు తెలిపారు. ఐటీడీఏ ద్వారా గిరిజన అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి వేలాది మంది గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ఒక్క అవకాశమని నమ్మించి గిరిజన ఓట్లను దండుకున్న జగన్‌మోహన్‌రెడ్డి గద్దెనెక్కిన తరువాత గిరిజనులను అణచివేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించకుండా గిరిజనుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. వైసీపీ పాలనలో ఎస్టీలపై దాడులు పెరిగాయని, గిరిజన తండాలు, గూడెంల అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిపౌరుడికి చంద్రన్న బీమా పథకం కల్పిస్తే నేడు వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేసి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. గిరిజన అభివృద్ధికి ఉజ్వల భవిష్యత్‌ను ఇచ్చిన సేవాలాల్‌ మహరాజ్‌ స్ఫూర్తితో గిరిజనులు ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దూపాటి ఏసుబాబు, పెమ్మసాని నాగేశ్వరరావు, హనుమానాయక్‌, దాసరి కోటేశ్వరరావు, అర్ధలపూడి శ్రీను, రావూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T06:11:08+05:30 IST