టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఇళ్లల్లోనే!

ABN , First Publish Date - 2020-03-29T08:26:47+05:30 IST

‘‘కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు ఇళ్లల్లోనే జరుపుకోవాలి. ఇళ్లపై టీడీపీ జెండాలు...

టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఇళ్లల్లోనే!

  • పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
  • 4 టీ విధానంతో సత్‌ ఫలితాలు
  • ఫ్రంట్‌లైన్‌ వారియర్ల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
  • టీడీపీ అధినేత సూచన

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు ఇళ్లల్లోనే జరుపుకోవాలి. ఇళ్లపై టీడీపీ జెండాలు ఎగరేయాలి. ఎన్టీఆర్‌ చిత్ర పటాల వద్ద నివాళులర్పించాలి’’ అని తెలుగు రాష్ట్రాల పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. శనివారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘టీడీపీ రాజకీయ పార్టీ మాత్రమే కాదు. సామాజిక బాధ్యతున్న పార్టీ. బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన పార్టీ.  మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన పార్టీ. ‘తెలుగుదేశం ముందు... తెలుగుదేశం తర్వాత’ అనే సరికొత్త యుగ విభజనని ఆరంభించిన పార్టీ టీడీపీ. పార్టీ సిద్ధాంతాలకు పునరంకితం కావాలి. అన్ని వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాలి. ఎన్టీఆర్‌ ఆశయాల సాధనకు అందరూ కలిసి నడవాలి’’ అని పిలుపునిచ్చారు. యావత్‌ ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న కరోనాని ఎవరూ తేలిగ్గా తీసుకోకూడదని చంద్రబాబు హెచ్చరించారు. ఆర్థికవ్యవస్థ తల్లకిందులయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. కోట్లాది మందికి ఉపాధి పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు.


ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ గురించి వివరించారు. దక్షిణ కొరియాలో 4 టీ విధానంతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ‘‘ట్రేస్‌, ట్రాక్‌, టెస్ట్‌, ట్రీట్‌’’ ద్వారా కరోనా కట్టడి చేస్తున్నారన్నారు. టెక్నాలజీతో కొన్ని దేశాల్లో కట్టడి చేశారన్నారు. హుద్‌హుద్‌, తితలీ తుఫాన్లలో ఆర్టీజీఎస్‌ దోహదపడిందన్నారు. మన ఆర్టీజీఎ్‌సని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని సూచించారు. 2 నెలల్లో విదేశాల నుంచి 15 లక్షల మంది వచ్చారన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి ఆర్టీజీఎస్‌ దోహదపడేదన్నారు. ప్రజల పట్ల పోలీసులు పూర్తి నిగ్రహం పాటించాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలూ పోలీసులకు సహకరించాలన్నారు. 


Updated Date - 2020-03-29T08:26:47+05:30 IST