అన్నదాతకు అండగా..

ABN , First Publish Date - 2021-09-18T04:56:48+05:30 IST

అన్నదాతకు అండగా..

అన్నదాతకు అండగా..
ఆమదాలవలస రూరల్‌ : తహసీల్దార్‌కు రైతు సమస్యలు వివరిస్తున్న కూన రవికుమార్‌, పాతపట్నం : మాట్లాడుతున్న ఎంపీ కింజరాపు రామ్మోహననాయడు... ప్రధాన రహదారిపై కదంతొక్కిన పచ్చదండు, జి.సిగడాం : తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న కళా వెంకటరావు

-  ‘రైతు కోసం టీడీపీ’ విజయవంతం

- కదంతొక్కిన తెలుగు తమ్ముళ్లు


రాష్ట్ర ప్రభుత్వ పాలనలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు అండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉద్యమించారు. అధిష్ఠానం పిలుపుమేరకు జిల్లాలో శుక్రవారం ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరిట నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ప్రభుత్వ తీరుపై గళమెత్తారు. ‘రైతుల్లారా రారండి.. ప్రభంజనమై హోరెత్తండి’ అంటూ పిలుపునిచ్చారు. పంటకు మద్దతు ధర లేకపోవడం,  సంక్షేమ పథకాలు సక్రమంగా దక్కకపోవడం, వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్ల అమరిక వంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తహసీల్దారులకు వినతిపత్రాలు అందజేశారు.  


రైతు దగా ప్రభుత్వం

-  శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

ఆమదాలవలస రూరల్‌, సెప్టెంబరు 17 : ‘రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగిస్తూ పాలన సాగిస్తోంది. ముఖ్యంగా రైతులను దగా చేస్తోంది’ అని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఆరోపించారు. శుక్రవారం ఆమదాలవలసలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘టీడీపీ హయాంలో ప్రతి రైతుకు రూ.75వేలు వివిధ రాయితీల ద్వారా అందేది.  ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద రూ.7,500తో సరిపెడుతోంది. అర్హుల పింఛన్లు, రేషన్‌ కార్డులను తొలగిస్తోంది. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రజాగ్రహం తప్పదు. న్యాయం కోసం రోడ్డుపైకి వస్తే అరెస్టులు చేయడం తగదు. సంకల్పయాత్రలో రైతులకు స్థిర నిధి ఏర్పాటు చేస్తామని హమీలు గుప్పించిన జగన్మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి పాలన సాగుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు, నిరుపేదల పొట్ట కొడుతున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి’ అని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు మొదలవలస రమేష్‌, అంబళ్ల రాంబాబు, సనపల ఢిల్లేశ్వరరావు, నూకరాజు, శివ్వాల సూర్యం, కూన వెంకట సత్యనారాయణ, తమ్మినేని అప్పలనాయుడు, గొండు రమణమూర్తి, నేతింటి జ్యోతిశ్వరరావు, కిల్లి మార్కెండేయులు, కిల్లి సిద్ధార్థ, బోర గోవిందరావు, బీవీ రమణమూర్తి, అన్నెపు భాస్కరరావు, హనుమంతు బాలకృష్ణ పాల్గొన్నారు.


అడుగడుగునా అడ్డంకులే...

పార్టీ సమావేశానికి వస్తున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఉదయం సమావేశం అనంతరం టీడీపీ శ్రేణులు ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు గేటును మూసివేశారు. క్రీయాశీలక నాయకులను మాత్రమే లోపలకు అనుమతిస్తామని చెప్పారు. ఈక్రమంలో తోపులాట జరగడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో కార్యకర్తలంతా కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ వైవీ పద్మావతి రావడంతో కూన రవికుమార్‌ తదితరులు రైతుల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు.


లెక్కింపులో నిర్లక్ష్యం వద్దు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపునకు వెళ్లే పార్టీ ఏజెంట్లు నిర్లక్ష్యంగా ఉండొద్దని కూన రవికుమార్‌ సూచించారు. కౌంటింగ్‌ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి అభ్యంతరాలున్నా వెంటనే ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.  



బెదిరింపులకు భయపడం

- ప్రజల పక్షాన పోరాడుతాం

- ఎంపీ రామ్మోహన్‌నాయుడు

పాతపట్నం, సెప్టెంబరు 17 : ‘ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతాం. బెదిరింపులకు భయపడేది లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలకు అండగా ఉంటా’మని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శుక్రవారం పాతపట్నంలో ‘రైతుకోసం టీడీపీ’ నిరసన ర్యాలీ చేపట్టారు. పాతపట్నం నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోంది. సకాలంలో ఎరువులు లభ్యం కావడం లేదు. విక్రయించిన ధాన్యానికి డబ్బులు చెల్లించడం లేదు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందడం లేదు. రైతుభరోసా కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాటివల్ల రైతులకు లబ్ధి కలుగడం లేదు. రబీ పంటను కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది’ అని ఆరోపించారు. రైతులకు అండగా టీడీపీ ఉందంటూ భరోసా నిచ్చారు. రైతులు, ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. పోలీసులతో తమ కార్యక్రమాలు అడ్డుకునేలా బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. వైసీపీ నాయకుల గడప తొక్కితేనే.. సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారా? అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్‌.ఎన్‌.పేట మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   


ఇంత మోసమా?

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు  కళావెంకటరావు

జి.సిగడాం, సెప్టెంబరు 17: రైతులను ఇంత మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. శుక్రవారం జి.సిగడాంలో ‘రైతుకోసం టీడీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాల వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదు. టీడీపీ హయాంలో రైతుల శ్రేయస్సు కోసం తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులను పూర్తిచేశాం. మా అధినేత చంద్రబాబునాయుడు రైతు బాంధవుడిగా చరిత్రలో నిలిచారు. వైసీపీ హయాంలో సాగునీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్‌లో రైతులు, ప్రజలే వైసీపీకి బుద్ధి చెబుతారు’ అని పేర్కొన్నారు. అనంతరం వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. రెవెన్యూ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుమరాపు రవికుమార్‌, బెవర జగన్నాఽథరావు, నక్క మురళి, టంకాల మౌళీశ్వరరావు. పి.బంగారినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-09-18T04:56:48+05:30 IST