సభ్యత్వ నమోదుపై టీడీపీ దృష్టి

ABN , First Publish Date - 2022-07-27T05:03:30+05:30 IST

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, సంస్థాగత కమిటీల నియామకాన్ని వచ్చే నెల 15లోపు పూర్తిచేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

సభ్యత్వ నమోదుపై టీడీపీ దృష్టి
సమావేశానికి హాజరైన మాజీ మంత్రులు, టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు

వచ్చే నెల 15కల్లా పూర్తి చేయాలని నిర్ణయం
‘ఆన్‌లైన్‌’లో సమస్యలు తలెత్తుతున్నాయన్న ఇన్‌చార్జులు
గతంలో మాదిరిగా నమోదుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి
రెండు వారాల్లోగా సంస్థాగత కమిటీల నియామకం పూర్తి
అన్ని పంచాయతీల్లోనూ బాదుడే బాదుడు కార్యక్రమం
విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతల సమావేశం
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అభిప్రాయం

విశాఖపట్నం, జూలై 26(ఆంధ్రజ్యోతి):
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, సంస్థాగత కమిటీల నియామకాన్ని వచ్చే నెల 15లోపు పూర్తిచేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉత్తరాంధ్ర జోన్‌-1 సమావేశం ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అధ్యక్షతన జరిగింది. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. పలువురు ఇన్‌చార్జులు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదుకు కీలకమైన యాప్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఆన్‌లైన్‌లో అన్ని వివరాలు అప్‌లోడ్‌ చేసిన తరువాత సదరు వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తేనే సభ్యత్వం నమోదవుతుందని, దీనికి ఇంటర్‌నెట్‌ సమస్య ప్రతిబంధకంగా మారిందని అన్నారు. ప్రధానంగా మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉందన్నారు. సాలూరు అటవీ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌ వుండదని ఇన్‌చార్జి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్‌లలో ఈ సమస్య వుండడంతో సభ్యత్వ నమోదు వేగంగా జరగడం లేదన్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాలతోపాటు నగరంలో ఇన్‌చార్జులు కూడా ఇదే సమస్యను ప్రస్తావించారు. ఆన్‌లైన్‌లోనే కాకుండా గతంలో మాదిరిగా ఆఫ్‌లైన్‌లో కూడా సభ్యత్వ నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్యెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తదితరులు కూడా యాప్‌ సమస్య వుందని వివరించడంతో బుద్దా వెంకన్న స్పందిస్తూ అధినేత దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీకల్లా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు కోసం ప్రతి సెగ్మెంట్‌కు రాష్ట్ర కార్యదర్శులను నియమించామని, వారితో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆగస్టు 15లోగా సభ్యత్వాలు పూర్తిచేయని సెగ్మెంట్‌ల ఇన్‌చార్జులతో అధినేత చంద్రబాబు స్వయంగా మాట్లాడతారన్నారు.

 బాదుడే బాదుడుపై ఇన్‌చార్జులు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు, ధరల పెరుగుదల, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపుపై చేపడుతున్న ఆందోళనకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.  ప్రభుత్వ పాలన, రహదారుల దుస్థితిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. కార్యక్రమాన్ని ఎన్నికల వరకు కొనసాగిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. బూత్‌, గ్రామ, క్లస్టర్‌ స్థాయిల్లో పార్టీ కమిటీల నియామకం పూర్తిచేశామని, ఇంకా పెండింగ్‌ ఉన్నచోట త్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ సంస్థాగత కమిటీల నియామకాన్ని కూడా రెండు వారాల్లో పూర్తిచేయాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటివరకు 80 శాతం పంచాయతీల్లో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వుందని పేర్కొంటూ సీఎం జగన్‌ పతనం ఉత్తరాంధ్ర నుంచి మొదలుకావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 35 (రంపచోడవరంతో కలిపి) అసెంబ్లీ స్థానాలనూ టీడీపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల ఇన్‌చార్జి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతం కావడానికి సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు ఎంతో కీలకమన్నారు. సమీక్షలో మాజీ మంత్రులు కిమిడి కళావెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్‌ నాయుడు (గజపతినగరం), కోళ్ల లలితకుమారి (ఎస్‌.కోట), ఇన్‌చార్జులు బేబీ నాయన (బొబ్బలి), కిమిడి నాగార్జున (చీపురుపల్లి) తదితరులు హాజరయ్యారు.



Updated Date - 2022-07-27T05:03:30+05:30 IST