టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ ఎవరు?

ABN , First Publish Date - 2021-04-15T05:57:09+05:30 IST

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పరాజయం తర్వాత కూడా తెలుగు తమ్ముళ్ల నడుమ సఖ్యత కుదరడం లేదు.

టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ ఎవరు?

తమ్ముళ్ల మధ్య తెగని పంచాయతీ

బాలస్వామిని ఎంపిక చేశారని ప్రచారం

తమకే కేటాయించాలని తూర్పు నేతల డిమాండ్‌


ఆంధ్రజ్యోతి, విజయవాడ : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పరాజయం తర్వాత కూడా తెలుగు తమ్ముళ్ల నడుమ సఖ్యత కుదరడం లేదు. ఎన్నికలు ముగిసి నెలరోజులు గడుస్తున్నా ఇంత వరకు కౌన్సిల్‌లో ప్రజాసమస్యల్ని వినిపించే ఫ్లోర్‌ లీడర్‌ ఎంపికలో టీడీపీ నాయకుల నడుమ ఏకాభిప్రాయం కుదరడం లేదు. గతంలో ఫ్లోర్‌ లీడర్‌గా పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల నేతలకు అవకాశం ఇచ్చారని, ఈసారి తమ నియోజకవర్గ నాయకుడికి అవకాశం ఇవ్వాలని తూర్పు నేతలు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం తూర్పు నియోజకవర్గంలోని డివిజన్ల అధ్యక్షులు సమావేశమయ్యారు. 


విజయవాడ నగరంలో టీడీపీ 14 స్థానాల్లో గెలుపొందింది. వీటిలో రెండు పశ్చిమ, ఐదు సెంట్రల్‌ నుంచి ఉండగా, తూర్పు నుంచి అత్యధికంగా ఏడు స్థానాలు ఉన్నాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు, ఈసారి తమ నియోజకవర్గానికే అవకాశం ఇవ్వాలని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 17 నుంచి కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ తరఫున ప్రజా సమస్యల్ని బలంగా వినిపించేందుకు ఫ్లోర్‌ లీడర్‌ ఎంపిక కీలకంగా ఉంటుంది. నగర సమస్యలపై అవగాహన, వాగ్దాటి ఉండి.. ప్రత్యర్థులతో లాలూచీపడే తత్వం లేని నాయకుడిని ఎంపిక చేయాలని తూర్పు నాయకులు సూచిస్తున్నారు. అయితే ఈ పదవికి సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన నెలిబండ్ల బాలస్వామిని ఎంపిక చేశారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పదవులకు రాజీనామాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని తూర్పు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ నియోజకవర్గం నుంచి పలువురు సీనియర్లు ఉన్నారని, వారిలో సత్తా ఉన్న వారికి పదవి ఇవ్వాలని తీర్మానించారు. ఇదే అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మంత్రి వెలంపల్లికి అత్యంత సన్నిహితంగా ఉండే వారికి ఈ పదవి ఇచ్చి టీడీపీని అభాసుపాలు చేయాలన్నది కొందరి లక్ష్యంగా ఉందని, అలాంటి వారికి అవకాశం ఇవ్వద్దని వారు కోరుతున్నారు. మేయర్‌ అభ్యర్థిగా ప్రచారం జరిగిన కేశినేని శ్వేతకు, లేదా సీనియర్లయిన ముమ్మనేని ప్రసాద్‌, జాస్తి సాంబశివరావు వంటివారికి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తూర్పు సమావేశంలో గద్దె ప్రసాద్‌, డాంగే కుమారి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-15T05:57:09+05:30 IST