టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం

ABN , First Publish Date - 2020-06-02T09:44:11+05:30 IST

చౌడేపల్లె బస్టాండులోని తెలుగు దేశం పార్టీ జెండా దిమ్మెను ఆదివారం రాత్రి దుండగులెవరో ధ్వంసం చేశారు.

టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం

చౌడేపల్లెలో పార్టీ శ్రేణుల ఆందోళన

పునర్నిర్మాణాన్ని అడ్డుకున్న పోలీసులు

 

చౌడేపల్లె, జూన్‌ 1: చౌడేపల్లె బస్టాండులోని  తెలుగు దేశం పార్టీ జెండా దిమ్మెను ఆదివారం రాత్రి దుండగులెవరో ధ్వంసం చేశారు. ఈ విషయమై సోమవారం బోయకొండ ఆలయ మాజీ ఛైర్మన్‌ గువ్వల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.జెండాదిమ్మె రాళ్లను  రోడ్డుకు అడ్డు పెట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ బైఠాయించారు. ఈ సందర్బంగా  రామకృష్ణారెడ్డితో పాటు తెలుగు యువత  జిల్లా ఉపాధఽ్యక్షుడు రమేష్‌ రెడ్డి  మాట్లాడుతూ కావాలనే  టీడీపీ జెండా దిమ్మెను ధ్వంసం చేశారని ఆరోపించారు.పుంగనూరు రూరల్‌ సీఐ మధుసూదన రెడ్డి ,ఎస్‌ఐ కృష్ణమోహన్‌ సంఘటన స్థలానికి చేరుకుని దిమ్మెను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పి ఆందోళనను విరమింప జేశారు. బస్టాండులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా లారీ ఒకటి రివర్సు అవుతూ ఢీ కొనడంతో దిమ్మె ధ్వంసమైనట్లు గుర్తించినట్లు సీఐ పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు రమేష్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


ధ్వంసమైన టీడీపీ జెండా దిమ్మెను తిరిగి నిర్మించుకుంటామని ఇసుకతోకూడిన ట్రాక్టర్‌ను సోమవారం రాత్రి తీసుకురాగా పోలీసులు అడ్డుకున్నారు.రమేష్‌రెడ్డి తన అనుచరులతో కలసి ట్రాక్టర్‌లోని ఇసుకను బస్టాండులో దింపుతుండగా కానిస్టేబుల్‌ విశ్వనాథ్‌ ఇక్కడ దింపరాదని చెప్పి తన సెల్‌ ఫోన్‌లో విడియో తీయబోయాడు. తీయరాదని రమేష్‌రెడ్డి, ఇసుక దింపరాదని కానిస్టేబుల్‌ ఒకరినొకరు తోసులాడుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ బస్టాండులో ధ్వంసమైన దిమ్మె నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, తిరిగి రోడ్డుపై ఎలాంటి నిర్మాణాలు జరపకుండా చూడాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులు  లెటర్‌ పంపారన్నారు. అలాగే  పంచాయతీ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి నిర్మాణాలు తిరిగి చేపట్టకుండా చూడాలని ఫిర్యాదు అందిందన్నారు. అనంతరం పంచాయతీ కార్మికులతో కలసి ఎక్స్‌కవేటర్‌తో జెండా దిమ్మెకు సంబందించిన శిథిలాలను తొలగించారు.కరోనా నేపధ్యంలో మాస్కులు లేకుండా గుంపులుగుంపులుగా ధర్నా చేసిన టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2020-06-02T09:44:11+05:30 IST