సైకిల్‌కి కొత్త టీమ్‌

ABN , First Publish Date - 2020-09-27T07:45:43+05:30 IST

పార్లమెంటరీ నియోజకవర్గాలను జిల్లాలుగా భావిస్తూ కొత్త కార్యవర్గాల రూపకల్పన, సారథుల కోసం గడిచిన రెండు మాసాలుగా చేసిన అన్వేషణ, కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చి....

సైకిల్‌కి కొత్త టీమ్‌

నేడు అధికారిక ప్రకటన

ఇప్పటికే అధిష్ఠానం కసరత్తు

రేసులో గన్ని, సీతమ్మ 

మెంటే, మరికొందరి పేర్లు కూడా వినికిడి 

జిల్లా కోఆర్డినేటర్‌గా నిమ్మల

రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు 

టీడీపీ వర్గాల్లో ఇప్పుడిదే టెన్షన్‌


ఏలూరు - ఆంధ్రజ్యోతి: పార్లమెంటరీ నియోజకవర్గాలను జిల్లాలుగా భావిస్తూ కొత్త కార్యవర్గాల రూపకల్పన, సారథుల కోసం గడిచిన రెండు మాసాలుగా చేసిన అన్వేషణ, కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చి ంది. ఈ మేరకు ఆదివారం అధికార ప్రకటన వెలువరించేందుకు తెలుగుదేశం సిద్ధపడింది.    నరసాపురం లోక్‌సభ స్థానానికి తొలుత పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును సారఽథిగా పెట్టేందుకు వీలుగా కసరత్తు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే రామానాయుడు అసెంబ్లీలో టీడీపీ ఉపనేతగా ఉన్నారు. ఈ తరుణంలో ఒక వేళ ఎమ్మెల్యేగా, పార్టీ సారధిగా ఉమ్మడిగా బాధ్యతలు భుజానికి ఎత్తితే ఒకింత కష్టసాధ్యం అవుతుందని,  మరొకరిని నియమించాలనే నిర్ణయానికి వచ్చారు. గడిచిన 11 ఏళ్ళుగా పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నిర్విరామ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీతారామలక్ష్మికే తిరిగి నరసాపురం లోక్‌సభ స్థానం బాధ్యతలను అప్పగించాలని పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది.


ఇదే నియోజకవర్గ పరిధిలో ఉన్న తాడేపల్లిగూడెం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తులు ఇతరత్రా వాటిని తొలగించేందుకు సీతారామలక్ష్మి అయితే ముక్కుసూటిగా వ్యవహరించగలుగుతారని భావించారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఇటీవల ఆమెతో చర్చించారు. ఆదివారం ఆమెతో మరోమారు చర్చించి నరసాపురం లోక్‌సభ స్థానం పగ్గాలపై తుది ప్రకటన చేయబోతున్నారు. ఇదే క్రమంలో మరో సీనియర్‌ మెంటే పార్థసారథి పేరు పరిశీలనలోకి తీసుకున్నారు. అలాగే ఏలూరు లోక్‌సభ స్థానానికి సంబంధించి బీసీ, ఎస్టీ, కాపు సామాజిక వర్గాల నుంచి పార్టీకి కట్టుబడి పనిచేసే వారిని నాయకత్వ పగ్గాలు అప్పగించాలని భావించి ఆ మేరకు కసరత్తు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, పాలి ప్రసాద్‌ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఏలూరు లోక్‌సభ స్థానంలో ఉన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పగ్గాలు అందరినీ కలుపుకు పోయే శక్తి సామర్థ్యాలు ఉన్నవారికే కొత్త కమిటీలో సారధ్య పగ్గాలు అప్పగించేందుకే టీడీపీ సుముఖంగా ఉంది. దీనిలో భాగంగానే ఆదివారం నాటికి ఒకవైపు రాష్ట్ర కమిటీ, మరోవైపు పార్లమెంటరీ స్థాయి జిల్లా అధ్యక్ష పదవులకు పేర్లను ప్రకటించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఏలూరుకు గన్ని వీరాంజనేయులు, నరసాపురానికి తోట సీతారామలక్ష్మి పేర్లు శనివారం రాత్రి వరకూ ఈ జాబితాలో చోటుకు సిద్ధం గానే ఉన్నాయి.


రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన పలువురికి స్థానం దక్కే అవకాశం స్పష్టంగా ఉంది. చింతమనేని ప్రభాకర్‌తో పాటు మరో ముగ్గురి పేర్లు పరిశీలనలోకి వచ్చినట్టు చెప్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాలు కేంద్రంగా కొత్త కమిటీలు రూపకల్పన చేసినా వీరిని సమన్వయ పర్చడానికి కొత్తగా కోఆర్డినేటర్‌ పదవిని టీడీపీ సృష్టించింది. నరసాపురం, ఏలూరు కమిటీలను సమన్వయపరిచే బాధ్యతను పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు అప్పగించబోతున్నారు.


కొవ్వూరు కథేంటి

రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం కమిటీ విషయంలో ఇప్పటికే బుచ్చయ్య చౌదరి, గన్ని కృష్ణ, ఆదిరెడ్డి అప్పారావు, కెఎస్‌ జవహర్‌ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీనిలో భాగంగానే మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌ పేరు కొందరు కొన్ని రోజులుగా భారీగా ప్రచారం లోకి తెచ్చారు. ఇది కాస్త కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణుల మధ్య ఉన్న వైరుధ్యాలను మరోమారు భగ్గుమనేలా చేసింది. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ విషయంలో ఇక్కడ పార్టీ దాదాపు చీలిక పీలికలైంది. జవహర్‌ అనుకూల వ్యతిరేక వర్గాలుగా ఇంతకు ముందు నుంచే చీలిపోయి వ్యవహరిస్తూ వచ్చారు.


తాజాగా రాజమహేంద్రవరం పార్లమెంటరీ పగ్గాలను జవహర్‌కి ఇస్తారన్న ప్రతిపాదనతోనే వ్యతిరేక టీముల్లో కుంపటి రాజుకుంది. దీంతో ప్రత్యేకంగా ఆయన వ్యతిరేక వర్గమంతా సమావేశమై జవహర్‌కు పగ్గాలు ఇస్తే పార్టీ భ్రష్టుపట్టి పోతుందంటూ అలా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత పార్టీ అధినేత చంద్రబాబుపై ఉందంటూ బహిరంగంగానే డిమాండ్‌ చేశారు. సీనియర్‌ నేత అచ్చిబాబులాంటి వారు ఆయన అనుకూలురు యావత్తు జవహర్‌కు కొవ్వూరు  నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించవద్దంటూ తమ డిమాండ్‌ను మరోసారి తెర ముందుకు తెచ్చారు. పార్టీ అఽధినేత చంద్ర బాబుతో పాటు లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. 

Updated Date - 2020-09-27T07:45:43+05:30 IST