అమరావతి: సినిమా టికెట్ల ధరపై మాట్లాడుతున్న జగన్‌రెడ్డి ప్రభుత్వం సిమెంట్ ధరలపై ఎందుకు మాట్లాడడం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ ఈ-పేపర్‌ను ఆవిష్కరించిన ఆయన సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టే జగన్ రెడ్డి ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారన్నారు. ఏపీలో నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. జగన్‌రెడ్డి పాలనలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పారు. ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు.
‘‘ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు జగన్‌రెడ్డి పీడిత బాధితులే. రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేక కళ తప్పింది. ప్రజా చైతన్యం ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. ఇది 5 కోట్ల మంది తెలుగు ప్రజల బాధ్యత. ప్రజా సమస్యలపై టీడీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. ఎవరెన్ని విధాలుగా బెదిరించినా టీడీపీ ముందుకే వెళ్తోంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లో ఎండగడతాం. సాక్షిలో అన్ని అబద్ధాలే..విశ్వసనీయత లేని వార్తలే. ఉద్యోగులను జగన్‌రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి