విద్యుత్‌ భారంపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-10-20T06:01:59+05:30 IST

విద్యుత్‌ సంక్షోభానికి సీఎం జగన్‌ రెడ్డి చేతకానితనమే కారణమని టీడీపీ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు, ఉంగు టూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆరోపించారు.

విద్యుత్‌ భారంపై టీడీపీ నిరసన

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమన్న గన్ని

 పెంచిన విద్యుత్‌ చార్జీల రద్దుకు డిమాండ్‌

భీమడోలు, అక్టోబరు 19 : విద్యుత్‌ సంక్షోభానికి సీఎం జగన్‌ రెడ్డి చేతకానితనమే కారణమని టీడీపీ ఏలూరు పార్లమెంటు  అధ్యక్షుడు, ఉంగు టూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆరోపించారు. మంగళ వారం భీమడోలు శివారు చిన లింగంపాడు, పెదలింగంపాడు గ్రామంలో ఆయన పర్యటించి విద్యుత్‌ ఇబ్బందులపై ప్రజలతో మాట్లాడారు. అనంతరం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమీషన్‌ కోసం అధిక రేట్లతో విద్యుత్‌ కొనుగోలు చేయడమే విద్యుత్‌ ఛార్జీలు పెంచడానికి కారణమన్నారు. ట్రూ అప్‌ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు విరమించుకోవాలని,  విద్యుత్‌ వెలుగులు  రావాలంటే జగన్‌ పోవాలంటూ నినాదాలు చేశారు.  పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

తాడేపల్లిగూడెం రూరల్‌: విద్యుత్‌ చార్జీల పెంపు సామాన్యులకు పెనుభారంగా మారిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచడం దారుణమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి పేర్కొన్నారు. మండలంలోని మెట్ట ఉప్పరగూడెంలో పార్టీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్‌ ఆధ్వర్యంలో కరెంటు చార్జీల పెంపుపై ఇంటింటికీ కరపత్రాలను పంచారు. ఈ సందర్బంగా బాబ్జి మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీల మోతతోపాటు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.  ముందుగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ వల్లభదాసు వెంకటేశ్వర్లుకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచ్‌లు మర్లపాటి సుబ్బలక్ష్మి, పోతుల అన్నవరం, పీతల సత్యనారాయణ,  తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, టీడీపీ నాయకులు వాడపల్లి వెంకట సుబ్బరాజు, మార్లపాటి నాగేశ్వరరావు, పరిమి వీరభద్రరావు, మద్దిపాటి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T06:01:59+05:30 IST