ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు!

ABN , First Publish Date - 2021-02-26T07:08:20+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఎన్నికల ఫలితాలను తారు మారు చేశారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు!

 పంచాయతీ పోరులో వైసీపీ అక్రమాలపై టీడీపీ ధర్నా

మచిలీపట్నం టౌన్‌, ఫిబ్రవరి 25 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఎన్నికల ఫలితాలను తారు మారు చేశారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు. మచిలీపట్నం ధర్నా చౌక్‌లో గురువారం పెడన, అవనిగడ్డ నియోజక వర్గాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన టీడీపీ మద్దతు అభ్యర్థి ముందుగా గెలిచినట్లు ఆర్‌వో ప్రకటించారని, ఆ తరువాత వైసీపీ నాయకుల దౌర్జన్యంతో పవర్‌ కట్‌ చేసి వైసీపీ మద్దతు అభ్యర్థి రెండు ఓట్లతో గెలిచారని చెప్పించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామానికి చెందిన ఆరో వార్డులో టీడీపీ మద్దతు అభ్యర్థి ప్రభాకర్‌ గెలిచిన రెండో రోజునే వైసీపీ నాయకులు దాడి జరిపారన్నారు. పెడన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, పెడన నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఓటర్లను అనేక ప్రలోభాలకు గురి చేశారన్నారు. టీడీపీ మద్దతు అభ్యర్థులపై అక్రమంగా దాడులు జరిపారన్నారు. టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత మాట్లాడుతూ, నాగాయలంక మండలం సంగమేశ్వరంలో టీడీపీ మద్దతు అభ్యర్థి  కొక్కిలిగడ్డ సంధ్యకు, వైసీపీ మద్దతు అభ్యర్థికి 830 ఓట్లు చొప్పున రాగా,  పోస్టల్‌ బ్యాలెట్‌లో మూడు ఓట్లు టీడీపీ మద్దతు అభ్యర్థికి వచ్చాయన్నారు. రీ కౌంటింగ్‌ కోరినా దాట వేసి వైసీపీ మద్దతు అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారన్నారు.   సంగమేశ్వరం నాయకురాలు కొక్కిలిగడ్డ సంధ్య, అర్త మూరు టీడీపీ నాయకుడు యార్లగడ్డ శ్రీనివాస రావు, మచిలీపట్నం మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, బత్తిన దాసు, పి.వి. ఫణికుమార్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో వెంకటేశ్వర్లుకు కొనకళ్ల నారాయణరావు వినతిపత్రం సమర్పించారు. 

Updated Date - 2021-02-26T07:08:20+05:30 IST