పెట్రోల్ బంకు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెంచలబాబుయాదవ్
ఉదయగిరి రూరల్, మే 25: దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఇండియన్ పెట్రోల్‌బంకు ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నినాదాలతో కూడిన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఒక వ్యాపారంగా మారిందన్నారు. ప్రతిరోజు ధరలు పెంచి కోట్ల రూపాయలు దోచేస్తున్నారన్నారు. అన్ని ధరలు పెట్రోల్, డీజిల్‌తో ముడిపడి ఉండడంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం కష్టతరమైందన్నారు. ధరలు పెరగడంవల్ల ప్రతి కుటుంబంపై నెలకు రూ.5 వేలు అదనపు భారం పడుతోందన్నారు. పెరిగిన ధరలతో వ్యవసాయరంగం కుదేలైందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే వ్యాట్ తగ్గించేంత వరకు టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బయ్యన్న, రియాజ్, బొజ్జా నరసింహులు, నల్లిపోగు రాజా, శనివారపు వెంకటేశ్వరరెడ్డి, ఓబులరెడ్డి, నరసింహారావు, అబీద్, మాబాషా, శివకృష్ణ, రామ్మోహన్, జల్సాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.