ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో మరికాసేపట్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ మునిసిపల్ ఎన్నికలు అందివచ్చిన అవకాశం. పోలింగ్ పూర్తవడానికి ఇంకా కొద్ది నిమిషాలే మిగిలి ఉంది. ఇంకా ఓటు వేయనివాళ్ళు వెంటనే వెళ్లి ఓటు వేసి రండి. ఓటు మన హక్కు. వృధా కానివ్వకండి’’ అని చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, పురపాలక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కొనసాగుతోంది. ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డులలో పోలింగ్ జరుగుతోంది.