జగన్‌కూ రాజపక్స గతే..!

ABN , First Publish Date - 2022-05-19T07:57:39+05:30 IST

‘శ్రీలంక ప్రధాని రాజపక్సకు పట్టిన గతి త్వరలో జగన్‌కు పడుతుంది. ఆర్మీ, పోలీసులు రాజపక్సను కాపాడలేకపోయారు. ప్రజలు తిరగబడితే ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు. జగన్‌కు కూడా అదే గతి పడుతుంది’ అని టీడీపీ అధినేత,

జగన్‌కూ రాజపక్స గతే..!

జనం తిరగబడితే శ్రీలంక ప్రధాని ఎక్కడికో వెళ్లిపోయారు

ముఖ్యమంత్రి జగన్‌కూ అదే పరిస్థితి తప్పదు

కడప వదిలివెళ్లకపోతే సీబీఐపై బాంబులేస్తారా?

జగన్‌ సహకారం లేక పోతే ఇలా బెదిరిస్తారా?

వివేకా హత్య కేసు నిందితుల లాయరుకు రాజ్యసభ సీటా?

పులివెందుల బస్టాండ్‌ కట్టలేదు.. 3 రాజధానులు కడతారంట!

ఈ పోరాటం భావితరాల కోసమే.. ఈ మూడేళ్లలో రూపాయి అభివృద్ధి లేదు

సీమలో ఒక్క పరిశ్రమా రాలేదు.. పెట్టుబడిదారులు పరార్‌.. బాబు ఆగ్రహం


నేను రాయలసీమ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశాను. జగన్‌ దానిని పూర్తిచేసి ఉంటే అభినందించేవాడిని. కానీ ఆయన దుర్బుద్ధితో.. కక్షతో మరో చోట శంకుస్థాపన చేశారు.

చంద్రబాబు


కడప, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘శ్రీలంక ప్రధాని రాజపక్సకు పట్టిన గతి త్వరలో జగన్‌కు పడుతుంది. ఆర్మీ, పోలీసులు రాజపక్సను కాపాడలేకపోయారు. ప్రజలు తిరగబడితే ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు. జగన్‌కు కూడా అదే గతి పడుతుంది’ అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కడప చేరుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. నగర శివారులో డీఎ్‌సఆర్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగిన ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లా కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. రాత్రికి కమలాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మద్యలో ఖాజీపేట, చెన్నూరు రోడ్‌షోలోనూ పాల్గొన్నారు. కడప వదిలి వెళ్లకపోతే సీబీఐపై బాంబులు వేస్తామంటున్నారని, జగన్‌ సహకారం లేక పోతే ఇలా బెదిరించగలరా అని ప్రశ్నించారు. ‘జగన్‌ ఊరికొక సైకోను తయారు చేశాడు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల తరఫున వాదిస్తున్న నిరంజన్‌రెడ్డిని జగన్‌ రాజ్యసభకు ఎంపిక చేశారు. జగన్‌పై సీబీఐ కేసులు కూడా ఆయనే వాదిస్తున్నారు. వివేకా తొలుత గుండెపోటుతో మృతి చెందారని జగన్‌ పత్రికలో ప్రచారం చేశారు.


ఆయన కూతురు పోస్టుమార్టం కోరడంతో తర్వాత హత్య కేసుగా నమోదు చేసి.. నారావారి రక్తచరిత్ర అని రాశారు. బాబాయిని చంపింది ఎవరో చెప్పే దమ్మూ ధైర్యం సీఎం జగన్‌కు ఉన్నాయా? సీబీఐపైనే బాంబులు వేసి చంపేస్తామంటున్నారు. వారికి మనం ఓ లెక్కా.. ఈ పోలీసులు ఓ లెక్కా..? ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నియంతలు గాలిలో కలిసిపోయారు. నీలాంటి డిక్టేటర్‌ కూడా కాలగర్భంలో కలిసిపోతారు’ అని సీఎంను హెచ్చరించారు. జగన్‌కు పాలించే అర్హత లేదని, దొంగలెక్కలు రాయడం, అడ్డంగా దొరికిపోవడం ఆయనకు అలవాటన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని సీబీఐ అభియోగం మోపిందని గుర్తుచేశారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం తెచ్చిన అప్పులకు రూ.48 వేల కోట్లకు లెక్కలేదని కాగ్‌ తేల్చిందన్నారు. మూడేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం వేశారని తెలిపారు. నవ్యాంధ్రను విద్య, ఆరోగ్య, మౌలిక వసతుల్లో నంబర్‌ 1గా మార్చాలని విజన్‌-2029కు రూపకల్పన చేశానని. అయితే ఇప్పుడు ఆంధ్ర అప్పుల్లో నంబర్‌వన్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నవరత్నాల పేరిట జనానికి నవరంధ్రాలు దింపుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్‌, డీజల్‌, కరెంట్‌ చార్జీలు, ఆస్తి పన్ను, చెత్త పన్ను, రిజిస్ర్టేషన్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, మరుగుదొడ్డి పన్ను ఇలా రకరకాల పన్నులు బాది మన జేబుకు కన్నం వేశారు’ అన్నారు. 


జగన్‌ది ఐరన్‌ లెగ్‌

‘జగన్‌ది ఐరన్‌ లెగ్‌... ఆ పాదముద్ర అక్కడ అంతా ఖతం... అమరావతిలో పాదంపెట్టాడు.. పతనమైంది. పోలవరంలో అడుగుపెట్టాడు.. పోయింది. కడపలో అడుగు పెట్టాడు.. స్టీల్‌ ఫ్యాక్టరీ పోయింది. ఇలా ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ‘కులం మతం ప్రాంతం చూడనని మాయమాటలు చెప్పి జనానికి శఠగోపం పెట్టారు. అధికారంలోకి వస్తే ఇంటింటికీ ఉద్యోగం అన్నారు. స్పెషల్‌ స్టేటస్‌ తీసుకొస్తానన్నారు. మూడేళ్ల పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? స్పెషల్‌ స్టేటస్‌ బదులు...స్పెషల్‌ స్టేటస్‌ పేరిట మద్యం తెచ్చారు. ఎన్నికల్లో మహిళా ఓట్ల కోసం మద్యపాన నిషేధం అన్నారు. అధికారంలోకి వచ్చాక ముట్టుకుంటే షాక్‌ కొట్టేలా ధరలు పెంచారు. దేశంలో ఎక్కడైనా కింగ్‌ఫిషర్‌ బీరు దొరికేది. ఇప్పుడు రాష్ట్రంలో భూమ్‌ భూమ్‌ బీరు దొరుకుతోంది. నాశిరకం మందు అమ్ముతున్నారు.


వీటిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి’ అని చెప్పారు. ఇంతలో ఓ టీడీపీ కార్యకర్త మద్యం సీసాను చంద్రబాబుకు ఇచ్చారు. ఆయన స్పందిస్తూ. ‘తమ్ముళ్లూ.. ఇది మల్బార్‌ హౌస్‌ మద్యం అంటా.. రేపు పులివెందుల పేరిట బ్రాందీ తెస్తారు’ అని వ్యంగ్యంగా అన్నారు. కడప జిల్లాలో మైనింగ్‌ మాఫియా, ఇసుక మాఫియా, బెరెటీస్‌ మాఫియా రాజ్యమేలుతున్నాయని.. అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలనని హెచ్చరించారు. ‘పులివెందుల చక్రాయపేటలో వైఎస్‌ కొండారెడ్డి 400 ఎకరాలు ఆక్రమించాడు. పులివెందుల్లో వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి 300 ఎకరాలు ఆక్రమించాడు.  బద్వేలులో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బంధువులు 800 ఎకరాలు కొన్నారు. మేం అధికారంలోకి వచ్చాక.. ఎవరెక్కడ దాక్కున్నా తీసుకొచ్చి శిక్షిస్తాం. భూ ములు పోగొట్టుకున్న వారికి అప్పగిస్తాం’ అని తెలిపారు. 


ఇది స్టిక్కర్‌ టీం..

మూడేళ్ల జగన్‌ పాలనలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదని చంద్రబాబు అన్నారు. ‘రాయలసీమలో ఒక్క పరిశ్రమ రాలేదు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ విడుద ల చేశారు. పెట్టుబడిదారులు పారిపోతున్నారు. మనం చేసిన పనులకు స్టిక్కర్లు వేసుకుని స్టిక్కర్‌ టీంగా మారిపోయారు. మనం కట్టిన శ్మశానాలు, మరుగుదొడ్లు, అంబులెన్స్‌లకు వైసీ పీ రంగులు వేసుకున్నారు. గండికోట నిర్వాసితులకు రూ.10 లక్షలిస్తానని జగన్‌ చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు? పైడిపాళెం ప్రాజెక్టులో 2 గ్రామాలకు పరిహారం ఇస్తే మిగిలిన గ్రామాల కు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఎత్తిపోయింది.


ఇప్పుడు పోలవరం ఆగిపోయింది. డయా ఫ్రం వాల్‌ను ముంచేశారు. కర్నూలులోని గోరకల్లులో సోలార్‌ హైఎండ్‌ ప్రాజెక్టును తీసుకొచ్చాం. ఇంత పెద్ద ప్రాజెక్టు ఆసియాలోనే ఎక్కడా లేదు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే కరెంటు కోతలు వచ్చేవి కావు. నాపై లేనిపోని ఆరోపణలు చేసి దానిని ఆపేశారు. నిన్న దానికి ప్రారంభం చేసి తానే తెచ్చినట్లు జగన్‌ పోజు కొడుతున్నారు. నవ్యాంధ్రలో నేను ముఖ్యమంత్రి అయ్యేనాటికి 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉండేది. 2 నెలల్లో లోటు తీర్చాను. ఒక్క రూపాయి కూడా చార్జీ పెంచలేదు. జగన్‌ మూడేళ్ల పాలనలో ఏడు సార్లు కరెంట్‌ చార్జీలు పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల బిల్లులు చూడండి.. రెండింతలు పెరిగాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు రైతుల మెడకు ఉరి. మీటర్లు పెడితే నష్టపోయేది రాయలసీమ రైతులే’ అని స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించడం చేతగాక.. టీడీపీపై బురద జల్లడంలో భాగంగా నారాయణ విద్యాసంస్థలపై బురదజల్లి మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారని ఆక్షేపించారు. ‘టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టూ తెగిపోలేదు. జగన్‌ ప్రభుత్వ నిర్వాకం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. సుమారు 40 మంది మృతి చెందారు’ అని తెలిపారు. కాగా, కడప పర్యటన ముగించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కోసం చంద్రబాబు బుధవారం రాత్రి కర్నూలు చేరుకున్నారు. ఆయనకు ఉమ్మడి జిల్లా టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.  


చంద్రబాబుకు అపూర్వ స్వాగతం 

హైదరాబాద్‌ నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు ఉదయం 11.45 గంటలకు చేరుకున్నారు. 12.30కి ఎయిర్‌పోర్ట్‌ బయట ఉన్న ఓపెన్‌ టాప్‌ వెహికల్‌లో బయల్దేరి ర్యాలీగా డీఎ్‌సఆర్‌ ఫంక్షన్‌ హాలుకు వచ్చారు. సుమారు 800 వాహనాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబుకు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇర్కాన్‌ సర్కిల్‌లో టీడీపీ నేత లక్ష్మిరెడ్డి, మన్మోహన్‌రెడ్డి ఆయనకు క్రేన్‌ ద్వారా గజమాల వేసి సత్కరించారు. ఎయిర్‌పోర్టు నుంచి కల్యాణ మండపానికి చేరుకునేందుకు సుమారు గంట సమయం పట్టింది. ఊహించని విధంగా టీడీపీ శ్రేణులు పోటెత్తడంతో నేతలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. కార్యక్రమంలో మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారె డ్డి, ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, శివనాథరెడ్డి, టీడీపీ నేతలు పుట్టా సుధాకర్‌యాదవ్‌, ప్రవీణ్‌కుమార్‌, భూపేశ్‌రెడ్డి, ప్రకాశ్‌నాయుడు, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గోవర ్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌, లింగారెడ్డి, రామగోపాల్‌రెడ్డి, కస్తూరి విశ్వనాథనాయుడు, నరసింహప్రసాద్‌, రితీ్‌షకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కడప నుంచే జైత్రయాత్ర..

తనకు కడప జిల్లా కొత్తకాదని.. అయితే ఇంత అపూర్వస్వాగతం, అభిమానం ఎన్నడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు. జగన్‌ పాలన అంతమొందించే జైత్రయాత్ర కడప నుంచే మొదలు కావాలని పిలుపిచ్చారు. ‘ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఈ నెల 28న మహానాడును ఘనంగా నిర్వహిస్తున్నాం. కార్యకర్తలు నా కుటుంబ సభ్యుల్లాంటి వారు. వారిని కాపాడుకుంటా. ఈసారి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. జెండా మోసిన కార్యకర్తలను ఆదుకుంటాం. నిరంతరం ప్రజల్లో ఉండాలి. వారి కోసం పోరాడాలి. అప్పుడు వెతికివెతికి మరీ అవకాశాలిస్తా. వైసీపీతో జాగ్రత్తగా ఉండాలి. ప్రజలను ఏకం చేసి వైసీపీ పాలనపై పోరాటం చేద్దాం’ అని అన్నారు.


పులివెందుల్లో ఆర్టీసీ బస్టాండ్‌ కట్టలేదు గానీ.. మూడు రాజధానులు కడతారంట! పులివెందులకు తాగునీరు ఇవ్వలేరు గానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంట! అన్నమయ్య ప్రాజెక్టులో వరదకు మూడూళ్లు కొట్టుకుపోతే ఇంతవరకు వాటిని నిర్మించలేదు గానీ జగన్‌ 30 లక్షల ఇళ్లు కడతారంట..!


ఒకప్పుడు రౌడీయిజాన్ని, టెర్రరిస్టులు, గూండాలను అణచివేసిన పోలీసులకు ఇప్పుడు ఏమైంది? రౌడీరాజ్యంలో నీరసించిపోయారా? ఉన్మాదులు చెబితే టీడీపీ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారు.

చంద్రబాబు

Updated Date - 2022-05-19T07:57:39+05:30 IST