జగన్‌ అసమర్థ సీఎం

ABN , First Publish Date - 2022-05-20T08:02:05+05:30 IST

‘త్వరలోనే ఎన్నికలు వస్తాయని కొందరు అంటున్నారు. ఐదేళ్లు పరిపాలించే దమ్ము.. సత్తా ఈ ముఖ్యమంత్రికి లేదని తేలిపోయింది. పాలన చేతకాని అసమర్థ సీఎం జగన్‌’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు

జగన్‌ అసమర్థ సీఎం

ఐదేళ్లూ పాలించే సత్తా లేకే ‘ముందస్తు’ యోచన

చేతకాని జగన్‌ది కరోనా కంటే భయంకర పాలన

22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే హోదా ఏదీ?

రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారు.. ఏ-2కి ఒక సీటు ఇచ్చాడు..

కేసులు వాదించే వ్యక్తికి ఇంకొకటి.. లాబీలు చేయడానికి మరొకరికి!

కర్నూలుకు హైకోర్టు తీసుకురాలేదేం?.. అది మీ చేతుల్లో ఉందా?

సీమలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు.. ఒక్క పరిశ్రమా తేలేదు

రోజుకు ముగ్గురు, నలుగురు రైతుల ఆత్మహత్య

ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే రాజీనామా చేయాలి.. బాబు ఆగ్రహం


కర్నూలు/నంద్యాల, మే 19 (ఆంధ్రజ్యోతి): ‘త్వరలోనే ఎన్నికలు వస్తాయని కొందరు అంటున్నారు. ఐదేళ్లు పరిపాలించే దమ్ము.. సత్తా ఈ ముఖ్యమంత్రికి లేదని తేలిపోయింది. పాలన చేతకాని అసమర్థ సీఎం జగన్‌’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం అర్ధరాత్రి కర్నూలు చేరుకున్న ఆయన.. గురువారం ఉదయం మౌర్యఇన్‌ హోటల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల నాయకులతో మాట్లాడారు. కమ్మ సంఘం కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. డోన్‌ నియోజకవర్గం ప్యాపిలి మండలం జలదుర్గంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో, డోన్‌లో రోడ్‌షోలు నిర్వహించారు. జగన్‌ సాగిస్తున్న విధ్వంస పాలనపై మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయా సందర్భాల్లో పిలుపిచ్చారు. అప్పుల ముఖ్యమంత్రి చెప్పులు అరిగిపోయే వరకు తిరుగుతున్నా.. అప్పులు ఇచ్చేవారు లేరని ఎద్దేవాచేశారు.


తిరిగి చెల్లించే స్తోమత ఉన్నప్పుడే రెండింతలు అప్పు ఇస్తారని చెప్పారు. ‘ఒక పక్క బాదుడే బాదుడు.. ఇంకోపక్క విధ్వంసమే విధ్వంసం.. మరోపక్క భవిష్యత్‌ అందకారంగా ఎక్కడికక్కడ వేధింపులే వేధింపులు. ఇంకోపక్క అప్పులే అప్పులు. ఎవరైనా మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు’ అని విరుచుకుపడ్డారు. తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. తాము కన్నెర్ర చేస్తే పోలీసు వ్యవస్థ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే..


గెలిపిస్తే ఏం చేశారు..? 

ప్రత్యేక హోదా తెస్తానంటే 22 ఎంపీ సీట్లలో గెలిపించారు.. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు.. అయినా మీరేం చేశారు? రాజ్యసభ సీట్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఏ-2కి ఒక రాజ్యసభ సీటు ఇచ్చాడు.. ఎందుకంటే ఆయన్ను సరిగా చూసుకోకపోతే ఏ-1 ఔట్‌.. ఆయన గాని అప్రూవర్‌గా మారితే మరుక్షణమే జైలుకు పోతాడు. తనపై సీబీఐ కేసులు విచారించే వ్యక్తికి ఒక రాజ్యసభ సీటు ఇచ్చాడు.. లాబీలు చేయడానికి మరొకరికి ఇచ్చారు. ఈ రాష్ట్రం మీ జాగీరా జగన్‌రెడ్డీ? కర్నూలుకు హైకోర్టు తెస్తామంటున్నారు. హైకోర్టు తీసుకురావడం మీ చేతుల్లో ఉందా..? రాష్ట్రపతి ఇవ్వాలి.. సుప్రీంకోర్టు ఇవ్వాలి. ఎవరిని మోసం చేయడానికి ఈ మాటలు? లోక్‌సభ, రాజ్యసభలో 31 మంది సభ్యులు మీకు ఉన్నారు.. హైకోర్టును ఎందుకు కర్నూలులో పెట్టలేదు..? ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదు..? పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? ఇవన్నీ ప్రశ్నిస్తే తెలుగుదేశం అడ్డం పడుతుందని అంటారు. మీ ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడితే కూడా మేమే కారణమా? చేతగాని అసమర్థులే ఇలా మాట్లాడతారు.


రూపాయి పెట్టుబడి వచ్చిందా?

రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. కర్నూలు జిల్లాకు మూడేళ్లలో ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చిందా..? ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా..? 33 వేల ఎకరాలతో ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ టౌన్‌షి్‌ప ఏర్పాటు చేశాను. బెంగళూరు-హైదరాబాద్‌ మధ్యలో కొన్ని హబ్‌లు ఏర్పాటు చేస్తే పరిశ్రమలు వస్తాయని కలలు కన్నాను. పరిశ్రమలు తీసుకొచ్చాను కూడా. అమెరికాకు చెందిన అయోవా విశ్వవిద్యాలయ సాంకేతిక పరిజ్ఞానం తీసుకుని ప్రపంచంలోనే గుర్తుండేలా తంగడంచెలో సీడ్‌ హబ్‌ ఏర్పాటు చేస్తే ఈ రోజుకూ అతీగతీ లేదు. మా ప్రభుత్వంలో మంజూరు చేసిన గుండ్రేవుల, ఆర్డీఎస్‌, వేదవతి ప్రాజెక్టులు ఏమయ్యాయి? రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అన్నారు.. ఏమైంది? పోలవరం పూర్తి చేసి.. గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేసి బానకచర్ల వద్దకు నేరుగా గోదావరి జలాలు తీసుకొస్తే రాయలసీమలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వస్తాయని కలలు కంటే... ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. జగన్‌ ప్రభుత్వ దుర్మార్గాలపై వీరోచితంగా పోరాడతాం.. ప్రజల ఆశీర్వాదం కావాలి. ఈ పోరాటం అధికారం, పదవుల కోసం కాదు. నాకు పదవులు కొత్తా కాదు. సమైక్యాంధ్రలో అందరికంటే ఎక్కువకాలం సీఎంగా ఉన్నాను. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రినీ నేనే.. ఈ రికార్డులు ఎవరూ బ్రేక్‌ చేయలేరు.


నిప్పులా బతికాను..

నిప్పులాగా బతికాను. అందుకే నా జోలికి ఎవరూ రాలేదు.. ఈ సైకో జగన్‌ వచ్చాడు. అవినీతి చేసి.. డబ్బులు దోచుకుని.. తప్పుడు లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోయి సీబీఐ కేసులో ఉన్న నీకు నాపై మాట్లాడే అర్హత ఉందా..? బాదుడే బాదుడు కార్యక్రమంతో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లాలి. జగన్‌ అకృత్యాలను వివరించాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అచ్చెన్నాయుడు సహా గ్రామస్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టినా వారు భయపడలేదు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు. జైలుకు వెళ్లివచ్చినా వీరోచితంగా పోరాడుతున్నాడు. ఈ ప్రభుత్వంపై పోరాడే ప్రతి కార్యకర్తా వీరుడే. నంద్యాలలో సత్తారు కుటుంబం ఆత్మహత్య సంఘటన వింటే బాధేస్తోంది. తాను చనిపోతే భార్య, పిల్లలు అనాథలవుతారని భావించి నలుగురూ రైలు కింద పడి బలవంతంగా చనిపోయారంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఈ ఉన్మాది జగన్‌కు అర్థం కాదు. పైశాచిక ఆనందం పొందుతున్న జగన్‌కు గుణపాఠం చెప్పే బాధ్యత తెలుగుదేశంపై ఉంది.


ఎక్కడా లేని ధరలు ఇక్కడే..!

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటకలో పెట్రోలు, డీజీల్‌, లిక్కర్‌ ధర ఎంత..? మన రాష్ట్రంలో ఎంతో తెలుసా..? ప్రపంచంలో ఎక్కడైనా భూంభూం బీరు ఉందా..? స్పెషల్‌ స్టేటస్‌ బ్రాందీ ఉందా..? ఒక్క జగన్‌రెడ్డి ఇలాకాలోనే ఉంది. 


కార్యకర్తల భద్రతకు ప్రణాళిక 

కొందరు నాయకులు సార్‌ నేను అది చేశాను.. ఇది చేశానని నా చుట్టూరే తిరుగుతుంటారు.. జనం మధ్యకు వెళ్లరు. ఇంకొందరు వలస పక్షులు ఉంటారు.. రేపు మనం అధికారంలోకి వస్తున్నాం.. మళ్లీ వాళ్లు మన వద్దకు వస్తారు. కష్టకాలంలో జెండా మోసిన వారికే నేను అండగా ఉంటా. పార్టీలో అన్ని రకాల కమిటీలు వేస్తున్నాం. ఒక్కో నియోజకవర్గంలో 5-6 వేల మందికి పదవులిస్తాం. మన ప్రభుత్వం వచ్చాక ఎవరెవరి సేవలు ఎలా ఉపయోగించుకోవాలో ప్రణాళిక తయారు చేశాం. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆలోచన చేస్తున్నాం. ఆరోగ్య భద్రత బాధ్యతా  తీసుకునేలా ఆలోచిస్తున్నాం. మహానాడు నుంచి ఇది అమలు చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో 40 శాతం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు యువతకే ఇస్తా.




నేడు ఉమ్మడి అనంతలో పర్యటన

అనంతపురం, మే 19 (ఆంధ్రజ్యోతి): బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. కర్నూలు నుంచి గురువారం అర్ధరాత్రి ఆయన అనంతపురానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం వీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్లో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరవుతారు.


ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అడిగితే సంస్థలు, బ్యాంకులు ఆనందంగా పెట్టుబడి పెట్టాయి. రాష్ట్రాన్ని ఏలిన అందరు ముఖ్యమంత్రులూ రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేస్తే.. జగన్‌ రూ.8 లక్షల కోట్లకు చేర్చారు. ఈయన దిగిపోయేలోపు రూ.11 లక్షల కోట్లకు ఈ అప్పులు చేరుకుంటాయి.


ప్రజలు పడుతున్న బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మూడేళ్లలో రెండేళ్లు కరోనా.. కరోనా కంటే భయంకరంగా జగన్మోహన్‌రెడ్డి పాలన ఉంది.


చంద్రబాబు

Updated Date - 2022-05-20T08:02:05+05:30 IST