ఆఫీస్‌ చూసి చంద్రబాబు దిగ్ర్భాంతి

ABN , First Publish Date - 2021-10-20T08:25:07+05:30 IST

వైసీపీ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిస్థితిని చూసి టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్ర్భాంతికి గురయ్యారు. దాడి విషయం తెలిసి ఉండవల్లిలోని తన నివాసం నుంచి హుటాహుటిన వచ్చిన ఆయన

ఆఫీస్‌ చూసి చంద్రబాబు దిగ్ర్భాంతి

దెబ్బలు తిన్న కార్యకర్తలకు పరామర్శ..

హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు


అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిస్థితిని చూసి టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్ర్భాంతికి గురయ్యారు. దాడి విషయం తెలిసి ఉండవల్లిలోని తన నివాసం నుంచి హుటాహుటిన వచ్చిన ఆయన మొత్తం కార్యాలయం అంతా తిరిగి చూశారు. దెబ్బలు తిన్న వారిని పరామర్శించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి సమయంలో ఆయన ఉండవల్లిలో ఉన్నారు. విజయవాడ నగరంలో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి ఘటన జరిగిన వెంటనే ఆయన అప్రమత్తమై పార్టీ నేతలతో మాట్లాడారు. పార్టీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడికి ఒక బృందం తయారవుతోందని తెలియగానే ఆయన డీజీపీకి ఫోన్‌ చేశారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. పార్టీ నాయకులకు చెప్పి మిగిలిన పోలీస్‌ అధికారులకు ఈ సమాచారం పంపించారు.


ఇది జరుగుతుండగానే పార్టీ కార్యాలయంపై దాడి మొదలైనట్లు ఆయనకు పార్టీ నేతలు తెలిపారు. గవర్నర్‌కు, కేంద్ర హోంమంత్రికి ఫోన్లు చేసి విషయం చెప్పారు. ఆ వెంటనే బయలుదేరి పార్టీ కార్యాలయానికి వచ్చారు. దాడి చేసిన వ్యక్తులు కొద్ది సేపటి క్రితమే అక్కడ నుంచి తమ వాహనాల్లో వెళ్లిపోయారు. కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు మొదట అక్కడ వైసీపీ కార్యకర్తల దాడిలో దెబ్బలు తిన్న కార్యకర్తల వద్దకు వెళ్లి ఓదార్చారు. అనిల్‌, విద్యా సాగర్‌, బద్రి అనే వారికి దెబ్బలు బలంగా తగలడంతో వారిని ఆస్పత్రికి పంపించారు. తర్వాత కార్యాలయం అంతా తిరిగి విధ్వంసాన్ని పరిశీలించారు. దాడికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న పార్టీ నేతలు ఆయనకు జరిగిన సంఘటన వివరించారు. ఆ సమయంలో ఆయన వైసీపీ కార్యకర్తల తీరుపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. వాళ్లను వదిలిపెట్టేది లేదని.. సంగతి తేలుస్తానని హెచ్చరించారు. దాడికి సంబంధించి పార్టీ కార్యాలయం లోపల ఉన్న కెమెరాల్లో రికార్డయిన ఫుటేజిని, పార్టీ కార్యాలయంలోని నేతలు తమ ఫోన్లలో రికార్డు చేసిన దృశ్యాలను పరిశీలించారు. ఆయనతోపాటు మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర తదితరులున్నారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్యులతో ఈ సంఘటనపై చర్చించారు. రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వాలని నిర్ణయించారు. 


పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు

దాడి విషయం టీవీల్లో చూసి సమీప గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. అదే సమయానికి పోలీసులు భద్రత పేరుతో కార్యాలయం లోపలికి వచ్చారు. పోలీసుల కుమ్మక్కుతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ ‘పోలీస్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కార్యాలయం నుంచి బయటకు వచ్చి నిలబడ్డారు. దాడి సమయంలో హైదరాబాద్‌లో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వెంటనే బయలుదేరి మంగళగిరి చేరుకొన్నారు. ఆయన కూడా కార్యాలయం మొత్తం తిరిగి చూసి కార్యకర్తలతో మాట్లాడారు. తర్వాత వారితో కలిసి దాడిని నిరసిస్తూ కార్యాలయం ముందు రహదారిపై బైఠాయించారు.


ఆగ్రహంతో ఊగిపోయిన బాబు

విలేకరుల సమావేశంలో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘సంయమనం పాటించాలని డీజీపీ ఎవరికి సుద్దులు చెబుతున్నారు? మా కార్యాలయంపై దాడి చేసి మమ్మల్ని చంపుతుంటే చంపించుకోవాలా? ఆయన కార్యాలయంపై దాడిచేస్తే ఇలాగే మాట్లాడతారా? చేతనైతే శాంతి భద్రతలను కాపాడండి.  లేకపోతే తప్పుకోండి. ఒక దళిత నాయకుడి ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపుతారా? ఇదేమైనా తమాషానా.. మా దగ్గర మీ తమాషాలు చెల్లవు. ఇలాంటి పోలీసులను చాలా మందిని చూశాను. తన కార్యాలయం పక్కన ఏం జరుగుతోందో తెలియకపోతే ఆయన డీజీపీగా ఉండటానికే అనర్హుడు. నా ఫోన్‌ తీయడానికి ఆయనకు సమయం లేదు. కేంద్ర హోంమంత్రి, గవర్నర్‌ మాత్రం వెంటనే నా ఫోన్‌ తీసి మాట్లాడారు. ఈయనకు ఉన్నంత పనిలేక వాళ్లు ఖాళీగా కూర్చున్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు. తనను, తమ పార్టీ నేతలను అధికార పార్టీ మంత్రులు, నాయకులు నోటికి వచ్చినట్టు బూతులు తిడుతున్నా భరించామని, తమను ఏం తిట్టినా అది పోలీసులకు కనిపించదా అని విస్మయం వ్యక్తంచేశారు. ‘‘నాకు ఆవేశం, కోపం ఎంత వస్తున్నా అదుపు చేసుకొని మాట్లాడుతున్నా. నా ఆవేశాన్ని ప్రదర్శించడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. నా ఇంటికి తాళ్లు కట్టి నేను ఇంట్లోనుంచి బయటకు రాకుండా నిలిపివేసిన రోజు కూడా ఓపిక పట్టాను.  మా పై కేసులు పెట్టారు.. అరెస్టులు చేశారు.. అయినా భయపడకపోతే ఇప్పుడు కార్యాలయంపై పడి దాడిచేసి  ఒకరిద్దరిని చంపాలని అనుకొంటున్నారు. దానితో భయపడి కార్యాలయం మూసేసుకొని పోతామని అనుకొంటున్నారు. అది ఏనాటికీ జరగదు. మేం వెనకడుగు వేసే సమస్య లేదు’ అని ఆయన తేల్చిచెప్పారు. 

Updated Date - 2021-10-20T08:25:07+05:30 IST