సీఎంకు చెంపపెట్టు

ABN , First Publish Date - 2021-06-15T08:43:15+05:30 IST

‘‘న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి తేలింది. మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వ చీకటి జీవోలను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తుగ్లక్‌ సీఎంకు చెంపపెట్టు

సీఎంకు చెంపపెట్టు

మాన్సాస్‌ ట్రస్ట్‌ కేసులో గెలిచిన న్యాయం

చీకటి జీవోలు తెస్తే చట్టం తాటతీస్తుంది

ఇకపైనా జగన్‌కు కనువిప్పు కలగాలి 

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు


అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘‘న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి తేలింది. మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వ చీకటి జీవోలను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తుగ్లక్‌ సీఎంకు చెంపపెట్టు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని దేవాలయాల ఆస్తులను, వేలాదిఎకరాల భూములను కొల్లగొట్టాలన్న జగన్‌రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు న్యాయం, చట్టం అడ్డుకట్ట వేసింది’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. పూసపాటి వంశీకులు ఆదరించిన లక్షలాది విద్యార్థులు, వేలాదిమంది ఉద్యోగులకు తీర్పు ఊపిరినిచ్చిందనీ, వేతనాలివ్వకుండా పెడుతున్న అవస్థలనుంచి వారికి స్వాంతన కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు. ధార్మిక సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తున్న సీఎంకు కోర్టు తీర్పు కళ్లెం వేసిందన్నారు. ‘‘గజపతి రాజుల వంశ ప్రతిష్ఠకు మసిపూయాలనుకున్న ఏ-1 రెడ్డి దుర్మార్గాన్ని కోర్టు నిలువరించింది. అధికారం ఉందని అడ్డగోలు జీవోలిస్తే, న్యాయం, చట్టం చూస్తూ ఉండవనటానికి ఈ తీర్పే నిదర్శనం. అలుపెరగని న్యాయ పోరాటంతో ట్రస్టును కాపాడుకోవడం అశోక్‌గజపతిరాజుతోపాటు ట్రస్టు ద్వారా ఆదరణ పొంతున్న అందరి విజయం. సింహాద్రి అప్పన్న అండగా ఉన్నంత వరకు న్యాయం, ధర్మం, చట్టం ఏకమై తాట తీస్తాయని జగన్‌రెడ్డి గుర్తుంచుకోవాలి. కోర్టులిచ్చే తీర్పులతో అయినా, జగన్‌రెడ్డి మూర్ఖత్వం వీడాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను హరించేలా నిరంకుశ పాలన సాగిస్తున్న జగన్‌రెడ్డికి ఈ తీర్పుతోనైనా కనువిప్పు కలగాలి’’ అని చంద్రబాబు హితవు పలికారు.


మాన్సాస్‌ ట్రస్ట్‌ నియామకం విషయంలో హైకోర్టు తీర్పు చెడుపై మంచి సాధించిన విజయమని, అధికారం చేతిలో ఉందని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటే కుదరదని జగన్‌రెడ్డి ఇప్పటికైనా తెలుసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచెన్నాయుడు అన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌పై నిబంధనలన్నీ అతిక్రమించి, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేయడం అంబేద్కర్‌ రాజ్యాంగ విజయమని అయ్యన్న పాత్రడు వ్యాఖ్యానించారు. మూర్ఖపురెడ్డి,  చీకటి జీవోల ఏ1  రెడ్డి,  ఏ2 రెడ్డి అరాచకాలకు ఇకనైనా అడ్డుకట్ట పడాలన్నారు. ఇక మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో హైకోర్టు తీర్పుతోనైనా జగన్‌ ప్రభుత్వ పోకడలో మార్పు రావాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన 166వ తీర్పు అని, న్యాయసలహాదారులు, ఏజీపీల పేరుతో రూ. కోట్లు దుర్వినియోగం చేస్తూ,  తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీర్పు కనువిప్పు కావాలని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎద్దేవా చేశారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వానికి చెంప చెళ్లుమనిపించేలా హైకోర్టు తీర్పు ఇచ్చిందని బుద్దా వెంకన్న అన్నారు. ఈ తీర్పును గౌరవించి, అశోక్‌గజపతిరాజును నియమిస్తూ, ప్రభుత్వం వెంటనే జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-06-15T08:43:15+05:30 IST