TDP Chief: సొంపెల్లి ప్రమాద ఘటనపై చంద్రబాబు ఏమన్నారంటే....

ABN , First Publish Date - 2022-07-22T20:35:16+05:30 IST

పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సొంపల్లి వద్ద జరిగిన పడవ ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

TDP Chief: సొంపెల్లి ప్రమాద ఘటనపై చంద్రబాబు ఏమన్నారంటే....

పశ్చిమగోదావరి: పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సొంపల్లి వద్ద జరిగిన పడవ ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) స్పందించారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉంటే,  ఏమి జరిగి ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తోందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో ఆయన మాట్లాడుతూ... ప్రజలు చైతన్యవంతులు కాకపోయుంటే గ్రామాలన్నీ గోదావరిలో కలిసిపోయేవన్నారు. ఇది చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ‘‘మీరు బురదలో ఉంటే ఆయన(సీఎం జగన్) గాలిలో తిరుగుతున్నార’’ని మండిపడ్డారు. కొంతమంది కళంకిత,  అవినీతి అధికారులను జగన్ నమ్ముకున్నారన్నారు. దళిత నేత రాజేష్‌ను ఏవిధంగా వేధిస్తున్నారో అందరం చూస్తున్నామన్నారు. తాము అవినీతికి పాల్పడ్డామని  జగన్ కల్లబొల్లి కబుర్లు చెప్పారని... అబద్ధాలు ఆడారు.. నాటకాలు ఆడారు.. ఇప్పుడు ఆయన  ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు చాలా భయంకరంగా తయారయ్యారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులకు కక్కూర్తి పడి డయాఫ్రం వాల్‌ను నాశనం చేశారని, దిగువ కాఫర్ డ్యాంను ముంచేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అజాగ్రత, నిర్లక్ష్యం వలన పోలవరం పూర్తికాలేదని కేంద్రమే చెప్పిందని చంద్రబాబు నాయుడు అన్నారు.


కాగా... వరద బాధితులను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పడవలో వెళ్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సోంపల్లి వద్ద చంద్రబాబు పడవ దిగగా..మిగిలిన వారు దిగుతున్న సమయంలో పడవ బోల్తా పడింది. పలువురు టీడీపీ నేతలు నీటిలో పడిపోయారు. వెంటనే మత్స్యకారులు స్పందించి టీడీపీ నేతలను నీటిలో నుంచి వెలికితీయడంతో ప్రమాదం తప్పింది. 

Updated Date - 2022-07-22T20:35:16+05:30 IST