వైసీపీ పాలనలో రైతులకు ప్రభుత్వ సాయం కరువు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-06-24T18:10:10+05:30 IST

వైసీపీ ప్రభుత్వం మామిడి రైతుల సమస్యలను గాలికొదిలిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.

వైసీపీ పాలనలో రైతులకు ప్రభుత్వ సాయం కరువు: చంద్రబాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం మామిడి రైతుల సమస్యలను గాలికొదిలిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే వైసీపీ నేతలకు  కమీషన్లు కావాలా అని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రైతులకు ప్రభుత్వం నుంచి  సాయం పూర్తిగా కరువైందన్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో ఏ ఒక్క రైతూ, వ్యవసాయ కూలీ సంతోషంగా లేరన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో తోతాపురి రకం టన్ను రూ.20 వేలు, బేనీషా రకం రూ.40 నుండి 50 వేలు, మల్లిక రకం రూ.60 వేలు, ఇమాంపసంద్ రకం రూ.90 వేలు, నీలం రకం రూ.30 నుండి 40 వేలు దాకా ధర ఉంటే..  వైసీపీ ప్రభుత్వ చర్యలతో తోతాపురి రకం రూ.6 నుండి 8 వేలు, బేనీషా రకం రూ.9 వేలు, మల్లిక రకం రూ. 25 వేలు, నీలం రకం రూ.18 వేలకు తగ్గిపోయాయన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఆయన  సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి నేతృత్వంలో గుజ్జు పాల్పడుతుంటే వైసీపీ నేతలకు కమీషన్లు కావాలా అని నిలదీశారు. పూతలపట్టు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మామిడి  రైతులు నష్టపోయారన్నారు. మామిడి రైతుల డిమాండ్లు పరిష్కరించే వరకు టీడీపీ పోరాటం ఆగదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-24T18:10:10+05:30 IST