వైసీపీ హయాంలో అప్పుల పిడుగు

ABN , First Publish Date - 2022-01-29T08:20:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై ఇప్పటికైనా స్పందించాలని కోరింది.

వైసీపీ హయాంలో అప్పుల పిడుగు

  • 32 నెలల్లో 3.64 లక్షల కోట్ల అప్పా?..
  • 28 మంది ఎంపీలు చేసింది ఏంటి?
  • టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం
  • అన్ని అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలని పార్లమెంటరీ పార్టీ నిర్ణయం


అమరావతి/శ్రీకాకుళం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై ఇప్పటికైనా స్పందించాలని కోరింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఎడా పెడా చేస్తున్న అప్పులతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, రాష్ట్రంపై అప్పుల పిడుగు పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. 28 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేక పోయారని విమర్శించింది. సోమవారం నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎంపీలు గల్లా జయదేవ్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌లతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. పాలన అంటే అప్పులు చేయడం, దోచుకోవడం అనేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీంతో రాష్ట్ర భవిష్యత్తు అత్యంత ప్రమాదంలో పడిపోయిందని నేతలు అభిప్రాయపడ్డారు.


చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు రూ.3.14 లక్షల కోట్లు ఉంటే.. వైపీపీ అధికారంలోకి వచ్చిన 32 నెలల్లోనే రూ.3.64 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఎలాంటి అభివృద్ధి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తెస్తున్న ఈ అప్పులతో తీవ్ర నష్టం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలి. దీనిపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు గళమెత్తాలి’’ అని సూచించారు. రాష్ట్రంలో అనేక సమస్యలుంటే.. వాటిని పరిష్కరించడం మానేసి కొత్త జిల్లాలకు ప్రకటన ఇవ్వడం సరికొత్త డ్రామానేనని టీడీపీ నేతలు విమర్శించారు. పీఆర్సీతో పాటు.. అనేక సమస్యలపై నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ కొత్త డ్రామా తెరమీదకి తెచ్చారని దుయ్యబట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చట్ట పరిరక్షణలో రాష్ట్ర పోలీసు శాఖ విఫలమవుతున్న తీరుతోపాటు అక్రమ కేసులపైనా పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయించారు. 

Updated Date - 2022-01-29T08:20:06+05:30 IST