పనిచేతకాని దద్దమ్మ!

ABN , First Publish Date - 2022-04-21T06:49:41+05:30 IST

పోలవరం కోసం ఐదేళ్ల తన శ్రమను పనిచేతకాని ఈ దద్దమ్మ నాశనం చేశాడని సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నిన్నటి దాకా భయపడిన ప్రజలు ఇవాళ ధైర్యంగా ముందుకొస్తున్నారని.. వారిలో వచ్చిన ఈ వ్యతిరేకతను చూసి

పనిచేతకాని దద్దమ్మ!

ఐదేళ్ల నా శ్రమను నాశనం చేశాడు!

సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్‌’

పోలవరంపై అవినీతి అంటూ కమిటీలు

ఎలుకను కాదు.. తోకపై వెంట్రుకా పీకలేదు

జగన్‌కు గడ్డి తినిపించే టైమొస్తోంది

రేషన్‌ కార్డు తీసేయబోతున్నారు

సంక్షేమ పథకాలూ పోతాయి జాగ్రత్త!

సంక్షేమానికి కాదు.. అవినీతికి అడ్డుపడతా

రైతులు చావొద్దు.. వైసీపీకి ఉరేయండి

తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

ఆగిరిపల్లి రచ్చబండలో టీడీపీ అధినేత


జగన్‌కు, ఆయన మంత్రులకు గడ్డి తినిపించే టైమొచ్చింది. మీ అందరికీ నేనున్నా. ధైర్యంగా ప్రశ్నించండి. నేను ఓ వర్గం వ్యక్తిని కాబట్టి ఆ సామాజిక వర్గం మొత్తం జగన్‌కు శత్రువులే. అలాగే రఘురామరాజు సామాజిక వర్గమూ ఇంకో శత్రువులు. దేవాలయాలపై దాడులను ప్రశ్నించినందుకు బ్రాహ్మణులు కూడా జగన్‌కు శత్రువులే. సామాజికవర్గాల మధ్య వైరం సృష్టిస్తున్నారు. 


చంద్రబాబు


ఏలూరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం కోసం ఐదేళ్ల తన శ్రమను పనిచేతకాని ఈ దద్దమ్మ నాశనం చేశాడని సీఎం జగన్మోహన్‌రెడ్డిపై  టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నిన్నటి దాకా భయపడిన ప్రజలు ఇవాళ ధైర్యంగా ముందుకొస్తున్నారని.. వారిలో వచ్చిన ఈ వ్యతిరేకతను చూసి జగన్‌కు కాళ్ల కింద భూమి కంపిస్తోందని.. వెన్నులో వణుకుపుడుతోందని చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలో ఆయన తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పోలవరం కోసం ప్రతి వారం సమీక్షలు, పని దినాలు కేటాయించుకుని 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తిచేశానని.. మూడేళ్లుగా వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయలేక చివరకు డయా ఫ్రం వాల్‌ పూడుకుపోయిందని, అదనంగా రూ.800 కోట్లు కావాలని కేంద్రానికి జగన్‌ విన్నవించుకున్నారని గుర్తు చేశారు. పనిచేసిన టీడీపీపై, తనపై అవినీతి ఆరోపణలు చేసి విచారణ కమిటీలు వేశారని, ఆ కమిటీలతో ఎలుకను కాదు కదా.. ఎలుక తోకపై వెంట్రుక కూడా పీకలేకపోయారని చెప్పారు. ‘రైతులు ఆత్మహత్య చేసుకోవడం కాదు. వైసీపీకే ఉరేయాలి. ఇవాళ అమెరికాలో మన తెలుగు యువత శాసిస్తుంటే, ఆ విద్యార్థుల సత్తా తెలియని జగన్‌ కనీస ప్రోత్సాహం ఇవ్వలేకపోతున్నారు. ప్రజలే కాదు, వైసీపీ నాయకులూ, రైతులు కూడా సంతోషంగా లేరు, తప్పక భరిస్తున్నారు అంతే. ఇప్పటిదాకా జనం చెవిలో జగన్‌ పూలు పెట్టారు.


ఇపుడు జనమే ఆ చెవులు జగన్‌కు పెట్టే సమయం వచ్చింది’ అని అన్నారు. నూజివీడు మామిడి పంటకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి రుణం కూడా ఇవ్వలేదని చెప్పారు. వంశధార మొదలు పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేసి రైతులకు నీళ్లివ్వాలని ప్రయత్నించానని.. పట్టిసీమను సవాల్‌గా తీసుకుని 9 నెలల్లో పూర్తి చేసి కృష్ణా డెల్టాకు సాగు నీరిచ్చానని గుర్తుచేశారు. చింతలపూడి ఎత్తిపోతల పూర్తయితే నూజివీడు పరిసర ప్రాంతాల్లో ప్రతి ఎకరానికి నీరందించవచ్చని.. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నూజివీడు ఎమ్మెల్యే ఏంచేస్తున్నారని ఆయన నిలదీశారు. ఇంకా ఏమన్నారంటే..


 రేషన్‌ కార్డు తీసేస్తున్నారు

రివర్స్‌ పాలనలో భాగంగా సంక్షేమ పథకాలకు చెక్‌ పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోంది. త్వరలో రేషన్‌ కార్డు తీసేస్తోంది. పింఛన్‌, అమ్మఒడితో పాటు సంక్షేమ పథకాలన్నీ కట్‌ అవుతాయి. ఆర్టీసీ చార్జీలు, కరెంట్‌ బిల్లులు పెంచారు. భారతీ సిమెంట్‌ ధరలను కూడా అదే స్థాయిలో పెంచుకుంటూ మిగతా సిమెంట్‌ ధరలను మాత్రం తగ్గించారు. జే టాక్సు రూపంలో వేల కోట్లను జేబుల్లో వేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీలోనూ శ్రీలంక మాదిరిగా కోడిగుడ్డు రూ.70, చికెన్‌ రూ.వెయ్యి, బంగాళదుంప కేజీ రూ.400లు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది.


అవినీతికి అడ్డుపడతా

సంక్షేమ పథకాలకు నేను వ్యతిరేకిని కాదు. వైసీపీ అవినీతికి అడ్డుపడతా. అక్రమార్జనకు, చీకటి జీవోలకు, మాఫియా, మట్టి దందాలకు అడ్డుపడతా. వైసీపీలో వేరు మాత్రమే కాదు.. అసలు తలే చెడిపోయింది. ఇక మొండెం ఏం పనికొస్తుంది? జగన్‌పై జనాల్లో ఇంత వ్యతిరేకతను నేనెప్పుడూ చూడలేదు. ఈ వ్యతిరేకత చూసి జగన్‌కు కాళ్ల కింద భూమి కంపిస్తోంది. ’


మీ పుణ్యమాని కెనడాలో..

‘ఎస్సీ వర్గానికి చెందిన నేను మీ పుణ్యమాని కెనడాలో ఎమ్మెస్‌ చదువుకున్నాను. 2018లో విదేశీ విద్య ద్వారా నాకు రుణం ఇవ్వబట్టే కెనడాలోనే ఉద్యోగం చేస్తూ, ఇవాళ ఏడాదికి రూ.60 లక్షలు సంపాదించుంటుకున్నాను.  బడుగు, బలహీన వర్గాల్లో నాలాంటి విద్యార్థులు ఎదగాలంటే  మీరు (చంద్రబాబు) మళ్లీ గెలవాలి సార్‌. 

ఉదయ్‌కుమార్‌, నూజివీడు మండలం, తుక్కులూరువాసి.


143 కుటుంబాలకు మోసం..

‘అధికారం అడ్డుపెట్టుకుని నెక్కలం, గొల్లగూడెంలో జగనన్న కాలనీలో అవినీతి చేశారు. నివాసయోగ్యం కాని స్థలాలను 143 స్థానిక కుటుంబాలను మోసం చేశారు.  శ్మశానం, చెరువు భూములను ఆక్రమించి, తప్పుడు పట్టాలు సృష్టించారు. భూ యజమానుల నుంచి రెండున్నర ఎకరాలు రూ.50 లక్షలకు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడితో కొనుగోలు చేయించి, ప్రభుత్వానికి మాత్రం రూ.కోటి 37 లక్షలకు విక్రయింపజేసి.. అధికార పార్టీ నాయకులు రూ.75 లక్షలను దోచుకున్నారు. అధికార పార్టీ నాయకుడినే అయినా జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించి ప్రజా పక్షాన పోరాడుతున్నాను.’

 కాజా రాంబాబు, వైసీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ, ఆగిరిపల్లి.


160 స్థానాల్లో గెలుపు: అచ్చెన్న

 ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలిచి తీరుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  అన్నారు. ఇలాంటి దుర్మార్గపు సీఎంను 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో చూడలేదన్నారు.




దుర్గగుడిలో ప్రత్యేక పూజలు 

విజయవాడ, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తా. తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకువస్తా. నాకు ఆ శక్తిసామర్థ్యాలను, ప్రజల ఇబ్బందులను తొలగించే తెలివితేటలను ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నా’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయన పార్టీ నేతలతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చారు. జగన్మాత కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 

Updated Date - 2022-04-21T06:49:41+05:30 IST