నిజాలుదాస్తే పెనుముప్పు!

ABN , First Publish Date - 2020-04-03T08:46:47+05:30 IST

నిజాలుదాస్తే పెనుముప్పు!

నిజాలుదాస్తే పెనుముప్పు!

పాజిటివ్‌లు దాస్తున్నారని అనుమానం

సీఎం వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు లేఖ


అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి దృష్ట్యా స్థానికంగా వాస్తవాలను తొక్కిపెట్టడం మంచిది కాదని, ఎప్పటికప్పుడు నిజాలను వెల్లడించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ‘‘పాజిటివ్‌ కేసులను దాచిపెడుతున్నారు. కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కరోనా వల్ల చనిపోయినా ప్రభుత్వం చెప్పడం లేదనే వార్తలున్నాయి. లెక్క తక్కువ చెబుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. నిజాలను దాచిపెడితే పెనుప్రమాదం తప్పదు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గురువారం ఆయన సీఎంకు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చకుండా, సమస్య జఠిలం కాకుండా వైద్య పరీక్షలు పెంచడం, పాజిటివ్‌ కేసులను గుర్తించడం, వైరస్‌ సోకినవారిని వేరు చేసి ప్రత్యేక చికిత్స చర్యలు తీసుకోవడం, ప్రజలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే చర్యలు తీసుకోవడం, అన్న క్యాంటీన్లు తెరిచి పేదలకు పోషకాహారం అందించడం వంటి తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ‘‘లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు పస్తులుండకుండా అన్నక్యాంటీన్లు తెరిచి ఆదుకోవాలి. లక్షలాది అసంఘటిత కార్మికులు, రిక్షా, ఆటో,చేనేత, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, జీవాల పెంపకందారులు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఎవరూ పస్తులుండరాదని కేంద్రం రూ.లక్షా75వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. మూడు నెలలకు రేషన్‌ సరుకులు, పింఛన్‌ ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశించింది. హైదరాబాద్‌లో పేదలకు అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా జీహెచ్‌ఎంసీ ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. మహారాష్ట్రలో 11నెలలుగా మూతపడ్డ అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు’’ అని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో  జీతాలు ఆపొద్దని ఇతర రాష్ట్రాల సీఎంలు చెప్తుంటే, లాక్‌డౌన్‌ వంకతో ఉద్యోగులు, పెన్షన్ల వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టడం, వాయిదా వేయడం సరికాదన్నారు. 

Updated Date - 2020-04-03T08:46:47+05:30 IST