ఏడాది కాలంగా చేసిందేమిటి... జగన్ సర్కార్‌పై చంద్రబాబు మండిపాటు

ABN , First Publish Date - 2020-06-06T00:05:42+05:30 IST

జగన్ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో

ఏడాది కాలంగా చేసిందేమిటి... జగన్ సర్కార్‌పై చంద్రబాబు మండిపాటు

ఇంటర్నెట్ డెస్క్: జగన్ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమని, ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా కలిగాక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే చరిత్రహీనులమవుతామని ట్వీట్ చేశారు. వైసీపీ పాలకులు గ్రహించాలని హితవు పలికారు. ప్రజలు నమ్మి, నాయకత్వాన్ని అంగీకరించినప్పుడు, హామీలపై 'జె-టర్న్' తీసుకుంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే చెప్పిన విశ్వసనీయత అనేది ఎక్కడున్నట్టని ఫైర్ అయ్యారు.


ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఏడాది కాలంగా రద్దులు, జె-టర్న్ లు తప్ప మీరు చేసిందేంటి? సన్న బియ్యంపై, కాళేశ్వరంపై, 45 ఏళ్లకే పింఛన్ పై, ఉద్యోగుల సిపిఎస్ పై, కరెంట్ చార్జీలపై, రైతులకు రూ 3 వేల కోట్ల స్థిరీకరణ నిధిపై, యువత ఉపాధిపై.. ఇలా అన్నింటిలోనూ మీరు తీసుకున్న జె-టర్న్‌లతో రాష్ట్రం కూడా రివర్స్‌లో తిరోగమనం పట్టింది. ప్రత్యేక హోదా నుంచి అమరావతి వరకు మీరెన్ని చెప్పారు? ఇప్పుడు చేస్తున్నది ఏంటి? అమలులో ఉన్న పది పాత పథకాలను రద్దుచేసి.. ఆ డబ్బుతో ఒక్క పథకం అమలు చేస్తామనడం మోసం. ఇకనైనా మాటమీద నిలబడి పాలన చేయండి’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.   




Updated Date - 2020-06-06T00:05:42+05:30 IST