బెదిరించి కండువా కప్పి..

ABN , First Publish Date - 2021-03-04T06:48:43+05:30 IST

నూజివీడులో టీడీపీ అభ్యర్థిగా కౌన్సిల్‌ బరిలోకి దిగిన ఎదురేశి ఎరకయ్య బుధవారం రాత్రి పార్టీ మారి, ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు.

బెదిరించి కండువా కప్పి..
వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న ఎరకయ్య

టీడీపీ అభ్యర్థిని తమ పార్టీలోకి రప్పించుకున్న వైసీపీ

నూజివీడు, ఆంధ్రజ్యోతి : నూజివీడులో టీడీపీ అభ్యర్థిగా కౌన్సిల్‌ బరిలోకి దిగిన ఎదురేశి ఎరకయ్య బుధవారం రాత్రి పార్టీ మారి, ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. పట్టణంలోని రెండో వార్డు టీడీపీకి కంచుకోట. ఆ వార్డులో టీడీపీ ఎరకయ్యను బరిలోకి దింపింది. ఈ వార్డుపై వైసీపీ నేతల కన్ను పడింది. టీడీపీ అభ్యర్థి బలహీనతలపై దృష్టి పెట్టారు. ఏడెకరాల భూమి వ్యవహారాన్ని బూచిగా చూపి, ‘పోటీ నుంచి విరమించకోకపోతే నీ పనిపడతాం’ అని బెదిరించడంతో ఇతను పార్టీ మారినట్లు సమాచారం. బెదిరింపుల వ్యవహారం స్థానిక టీడీపీ నాయకుల దృష్టికి రావడంతో వారు బుధవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు ఎరకయ్యను తమ దగ్గరే అట్టిపెట్టుకుని ధైర్యం చెప్పినట్లు సమాచారం. సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఎరకయ్య ఏడు గంటలకు ఎమ్మెల్యే ప్రతాప్‌, ఆయన కుమారుడు వేణుగోపాల్‌ సమక్షంలో పచ్చ చొక్కాపైనే వైసీపీ కండువా కప్పించుకుని, ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. దీంతో టీడీపీ నాయకులు షాక్‌లో ఉన్నారు. ఇప్పటికే రెండు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పార్టీకి సమాచారం ఇవ్వకుండానే, నామినేషన్లు ఉపసంహరించుకుని బరి నుంచి తప్పుకోవడంతో ఆ రెండు వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు ఏకంగా బరిలో ఉన్న అభ్యర్థి వైసీపీలోకి చేరడంతో పక్కా టీడీపీ వార్డు, వైసీపీకి కైవసం అయినట్లైయ్యింది. 

Updated Date - 2021-03-04T06:48:43+05:30 IST