బంద్‌పై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-10-21T06:46:38+05:30 IST

టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై వైసీపీ మూకల దాడులను నిరసిస్తూ బుధవారం టీడీపీ తలపెట్టిన బంద్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

బంద్‌పై ఉక్కుపాదం
పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ వద్ద మోహరించిన పోలీసులు

టీడీపీ శ్రేణులపై అడుగడుగునా నిర్బంధం 

ఎక్కడికక్కడ నేతల అరెస్టులు 

జిల్లావ్యాప్తంగా ఉద్రిక్తం 

 

టీడీపీ కార్యాలయాలపై, నాయకుల ఇళ్లపై వైసీపీ మూకల దాడులను నిరసిస్తూ బుధవారం టీడీపీ తలపెట్టిన బంద్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బంద్‌ను భగ్నం చేసేందుకు మంగళవారం రాత్రి నుంచే ప్రతిపక్ష పార్టీ నాయకులను, ముఖ్య కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పసుపు జెండాలను చేతబట్టుకుని రోడ్లమీదకు వచ్చి వ్యాపార వాణిజ్య సంస్థలను, బ్యాంకులను, విద్యాసంస్థలను మూయించారు. వారందరినీ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, స్టేషన్లకు తరలించగా, ఆ తర్వాత పలు ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూసి ఉన్న దుకాణాలను, బ్యాంకులను, విద్యాసంస్థలను బలవంతంగా తెరిపించారు.


విజయవాడ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ అరాచకాలను నిరసిస్తూ, జిల్లాలో బంద్‌ను విజయవంతం చేసేందుకు బయటకు వచ్చిన మాజీమంత్రులు, టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టులు చేయడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గొల్లపూడి జాతీయ రహదారిపై భవానీపురం పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసుస్టేషన్లో నిర్బంధించారు. మరో మాజీమంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో బంద్‌లో పాల్గొనగా, అక్కడి పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, మాజీమంత్రి నెట్టెం రఘురాం, టీడీపీ జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్యలను జగ్గయ్యపేట పట్ణణంలో అరెస్టు చేశారు. విజయవాడలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతల అరెస్టుల సందర్భంగా పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కాగిత కృష్ణప్రసాద్‌, నూజివీడు ఇన్‌చార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పామర్రు ఇన్‌చార్జ్‌ వర్ల కుమార్‌రాజా తదితరులతోపాటు ఆయా మండలాల ముఖ్య నాయకులందరినీ పోలీసులు ముందస్తుగానే గృహ నిర్బంధంలో ఉంచారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. 


పోలీసుల అదుపులో కొల్లు రవీంద్ర 

మచిలీపట్నం : టీడీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పాక్షికంగా జరిగింది. పాఠశాలలు  మూతపడ్డాయి. టీడీపీ నాయకులను, కార్యకర్తలను బుధవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడ పోలీసులు కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకుని ఆయన నివాసానికి తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, రవీంద్రకు మధ్య వాగ్వాదం జరిగింది. రవీంద్రను బలవంతంగా పోలీసులు జీపులోకి ఎక్కించారు. అడ్డువచ్చిన మహిళా కార్యకర్తలను పక్కకు నెట్టివేశారు.  



Updated Date - 2021-10-21T06:46:38+05:30 IST