అడుగడుగునా అడ్డంకులు

ABN , First Publish Date - 2021-10-21T04:44:41+05:30 IST

టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు బుధవారం మండలంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.

అడుగడుగునా అడ్డంకులు
విడవలూరులో ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు

ముందస్తుగా టీడీపీ నాయకుల గృహ నిర్బంధం

కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు


విడవలూరు, అక్టోబరు 20: టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు బుధవారం మండలంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులును ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. అయినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సినిమా హాల్‌ నుంచి అంకమ్మ దేవాలయం కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామతీర్థంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు ఆవుల రవీంద్ర, ప్రధాన కార్యదర్శి పొన్నాడి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో బంద్‌ను పాటించారు. ఆ సమయంలో అక్కడకి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యంరెడ్డి, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు రామిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రవాదులు పాలిస్తున్నట్లుగా ఉందన్నారు. ఈ ఆందోళనలో టీడీపీ నాయకులు మాతూరు శ్రీనివాసులురెడ్డి, ఇమాంబాషా, డక్కా భాస్కర్‌, శ్రీహరికోట గోపి, అశోక్‌, హజరత్‌, శూలం, సుధాకర్‌, కామేశ్వరమ్మ, నాసిన ఉదయ్‌కుమార్‌, నిమ్మల రాజేష్‌, అత్తిరాల సుమంత్‌, కత్తి బాలచంద్ర, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. 

కోవూరు : తెలుగుదేశం పార్టీ చేపట్టిన బంద్‌ బుధవారం పట్టణంలో ప్రశాంతంగా జరిగింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ చేపట్టి, దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. బంద్‌ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులను ఎస్‌ఐ డీ.వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. బంద్‌లో నాయకులు బాల రవి, పంది రఘురామ్‌, నాటకరాని వెంకట్‌, యద్దనపూడి నాగరాజు, నాటకరాని వెంకట్‌, పాలూరు వెంకటేశ్వర్లు, సాదిక్‌, ఫైరోజ్‌, బెల్లంకొండ విజయకుమార్‌, పన్నెం సుధాకర్‌, పన్నెం వంశీ, చామంతిపురం గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, మండల కమిటీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డిని పోలీసులు బంద్‌లో పాల్గొనకుండా గృహ నిర్బంధం చేశారు.

నెల్లూరు (ముత్తుకూరు) : టీడీపీ కార్యాలయాలు, ఇళ్లపై వైసీపీ నాయకుల దాడులను నిరసిస్తూ, బుధవారం శాంతియుతంగా బంద్‌ చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అడుకున్నారు. ముత్తుకూరు ప్రధాన కూడలిలో టీడీపీ నేతలు, తెలుగుయువత మండల అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, ఆందోళన నిర్వహించారు. వైసీపీ నాయకులు టీడీపీ కార్యాలయాలపై దాడి చేయడం అమానుషమన్నారు. కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి, ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి ప్రధాన కూడలికి చేరుకుని టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. బంద్‌ నిర్వహించేందుకు అనుమతులు లేవని, వెంటనే వెళ్లిపోవాలని సీఐ టీడీపీ నాయకులను కోరారు. ఈ క్రమంలో తమకు లేని అనుమతులు వైసీపీ నాయకులు ర్యాలీకి ఎలా వచ్చాయో చెప్పాలని తెలుగు యువత మండల అధ్యక్షుడు మునిరెడ్డి ప్రశ్నించారు. దీంతో సీఐ వేమారెడ్డి మునిరెడ్డిని అరెస్టు చేసి, బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. అందోళన చేస్తున్న మరో 12 మంది టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. అంతకు ముందు మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డిని ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి హౌస్‌ ఆరెస్టు చేసి, అయన ఇంటి వద్ద పోలీసులను కాపలా ఉంచారు. అరెస్టు చేసిన టీడీపీ నాయకులను సాయంత్రం స్టేషన్‌ పూచీకత్తుపై వదిలివేశారు. కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్‌ రైతు అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమనాయుడు,  టీడీపీ నాయకులు మాచిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, యదనపర్తి శ్యామ్‌, వావిళ్ల జనార్థన్‌, బొలిగర్ల శ్రీనివాసులు, పట్టపు శోభన్‌, పట్టపు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

బుచ్చిరెడ్డిపాళెం : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్‌ నేపథ్యంలో బుధవారం బుచ్చిరెడ్డిపాళెంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు వింజం మహేష్‌నాయుడు, టీడీపీ నియోజకవర్గ దళిత నాయకుడు ఉసురుపాటి ప్రసాద్‌ ఆధ్వర్యంలో పలువురు బుచ్చిలోని జొన్నవాడ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ముందుగా వారు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడులను ఖండించారు. ముందుగా పోలీసులు పలువురు టీడీపీ నాయకులను హౌస్‌ అరెస్టు చేయడంతో పాటు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. బంద్‌ సందర్భంగా తెలుగు యువత ఉపాఽధ్యక్షుడు కిషోర్‌ ఆధ్వర్యంలో పలువురు యువకులు స్థానిక డీఎల్‌ఎన్‌ఆర్‌ హైస్కూల్‌ను మూయించి వేశారు. అపుస్మా ఆధ్వర్యంలో బుచ్చిలోని 15 ప్రైవేటు పాఠశాలలు, 5 కార్పొరేట్‌ స్కూళ్లు స్వచ్ఛందంగా మూసివేసినట్లు అపుస్మా నేత నేలనూతల శ్రీధర్‌ తెలిపారు.  బంద్‌ సందర్భంగా బుచ్చిలోని జాతీయ రహదారితో పాటు పలు ప్రాంతాలను బుధవారం డీఎస్పీ హరనాథ్‌రెడ్డి పరిశీలించారు. అనంతంరం  సీఐ సీహెచ్‌. కోటేశ్వరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డిని బంద్‌ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మనుబోలు : టీడీపీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడంతో దానిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు బుధవారం వేకువజాము 5గంటలకే చేరుకున్నారు. ఎస్‌ఐ ముత్యాలరావు తన సిబ్బందితో వెళ్లి టీడీపీ మండలాధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డిని, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్‌, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాయపాటి కిరణ్‌కుమార్‌లతో పాటు మడమనూరులో ఉడతా విజయ్‌కుమార్‌, సుదీర్‌, వినోద్‌లను హౌస్‌ అరెస్టులు చేశారు. అలాగే మండల కేంద్రమైన మనుబోలులోని ప్రధాన కూడళ్ల వద్ద ధర్నాలు చేయకుండా ముందస్తుగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అరెస్టులపై పచ్చిపాల రామిరెడ్డి తన నివాసంలోనే నిరసన దీక్ష చేశారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఆయనతో పాటు పలువురు యువకులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.

పొదలకూరు : తెలుగుదేశం పార్టీ కార్యాలయం, నాయకులపై దాడులకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో పొదలకూరు పట్టణంలో ఉదయం నుంచి నాయకులు, కార్యకర్తలు నెల్లూరు రోడ్డు నుంచి పార్టీ జెండాలతో నిరసనలు చేపట్టారు. కార్యక్రమంలో తెలుగు యువత, టీడీపీ మండల నాయకుల నిరసన ర్యాలీ పంచాయతీ బస్టాండుకు సమీపించగానే పోలీసులు అడ్డుకుని, వారిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు నిరసన ర్యాలీ నిర్వహించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో   టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, పట్టణ అధ్యక్షుడు బి.మల్లికార్జున నాయుడు, సీనియర్‌ టీడీపీ నాయకులు బక్కయ్యనాయుడు, పులిపాటి వెంకటరత్నం నాయుడు, కోడూరు భాస్కర్‌రెడ్డి, కలగట్ల సందీప్‌, సుధాకర్‌రెడ్డి, పల్లారపు కృష్ణ, సుగుణమ్మ, జమీర్‌బాషా, తెలుగు యువత నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

ఇందుకూరుపేట : తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మండలంలో ఆ పార్టీ నేతలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో మండల కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్యకర్తలను అనుమతించలేదు. ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గేట్లు మూయించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయం నుంచి పార్టీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పార్లమెంటు జిల్లా కార్యదర్శి పి.చెంచుకిషోర్‌యాదవ్‌, మండల నాయకులు వీరేంద్ర, మునగాల రంగారావు, మాదాల రాంప్రసాద్‌, బాలబొమ్మ వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో మాత్రం బంద్‌ ఏ మాత్రం కనిపించలేదు.

కొడవలూరు : టీడీపీ కార్యాలయంపై, నాయకుల ఇళ్లపై   దాడులను నిరసిస్తూ మండలంలో టీడీపీ నాయకులు బుధవారం బంద్‌ నిర్వహించారు. బంద్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న కరకటి మల్లికార్జునను హౌస్‌ అరెస్టు చేశారు. అలాగే యల్లాయపాళెంలో బంద్‌ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు గరికపాటి రాజాను, టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. అనంతరం  టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస మూకలు రాజ్యమేలుతూ సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం అత్యంత పాశవిక చర్యన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట టీడీపీ నాయకులు తదితరులున్నారు. 

వెంకటాచలం : రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆ పార్టీ పిలుపు మేరకు బంద్‌లో పాల్గొనకుండా బుధవారం వేకువజామున ముందస్తుగా టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్‌ను అనికేపల్లిలోని ఆయన స్వగృహంలో గృహ నిర్బంధం చేశారు. అనంతరం వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకుని మండలాధ్యక్షుడిని హౌస్‌ అరెస్ట్‌ చేయకుండా పోలీసు స్టేషన్‌కు తీసుకురావడం ఏమిటని, తాము శాంతియుతంగా బంద్‌ చేసుకుంటామంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. వెంకటాచలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ర్యాలీ నిర్వహిస్తే ఆ ర్యాలీకి పోలీసులు దగ్గరుండి ఎస్కార్ట్‌ మాదిరిగా బందోబస్తు ఇవ్వడం ఏమిటని పోలీసులను నిలదీశారు. దీంతో   స్టేషన్‌ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై నినాదాలు చేశారు.  నెల్లూరు రూరల్‌ సీఐ జగన్‌మోహన్‌రావు నిరసన చేస్తున్న వల్లూరు రమేష్‌నాయుడు, కందిమళ్ల సతీష్‌నాయుడు, షేక్‌ అబ్దుల్లా, యాకల రవి, షేక్‌ సత్తార్‌ సాహెబ్‌, ఆదురు అమర్నాథ్‌, ఆస్తోటి నాగారాజులను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు అరెస్టు చేసిన టీడీపీ నాయకులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. 

తోటపల్లిగూడూరు : రాష్ట్రంలో రౌడీయిజం రాజ్యమేలుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కార్యాలయాలు, ఇళ్లపై వైసీపీ నాయకులు రాళ్ల దాడిచేసి, టీడీపీ నాయకులను అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మండల కన్వీనర్‌ సన్నారెడ్డి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీకి చెందిన నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తిరుపతి పార్లమెంటు కార్యదర్శి, ఎంపీటీసీ నరుకూరు కొణతం రఘుబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రధాన నాయకులను ముందస్తుగా హౌస్‌ అరెస్టులు చేసి, వైసీపీ నాయకులను మాత్రం నిరసనలకు ఎలా అనుమతులు ఇస్తారని తీవ్రంగా విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాసులు, తెలుగు యువత కార్యదర్శి సుధీర్‌, జితేంద్ర, కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-10-21T04:44:41+05:30 IST