అరాచకానికి పరాకాష్ఠ!

ABN , First Publish Date - 2022-07-02T07:40:21+05:30 IST

అరాచకానికి పరాకాష్ఠ!

అరాచకానికి పరాకాష్ఠ!

అధికారంలోకి వస్తాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం

సోషల్‌ మీడియా కార్యకర్తలపై సీఐడీ దౌర్జన్యం

నోటీసివ్వడానికి అర్ధరాత్రి గోడ దూకి వెళ్తారా?

ఇళ్ల తలుపులు పగలగొడతారా?

కస్టడీలో కొట్టామని బయట చెబితే గంజాయి కేసు పెడతామని బెదిరిస్తారా?

తప్పు చేసిన అధికారులపై ప్రైవేటు కేసులు

టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరిక


ఖాకీ బట్టలు వేసుకున్నారని ఏం చేసినా నోరుమూసుకుని ఉండాలా? టీడీపీ కార్యాలయంలో  పనిచేస్తున్న వారిని కొట్టడానికి ఎంత ధైర్యం? మా కార్యాలయంపై దాడి చేసిన వారిపై ఇంతవరకూ చర్యలు లేవు. సిగ్గయినా వేయడం లేదా?

ఈ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయి. ప్లీనరీల నుంచి ఆ పార్టీ కార్యకర్తలే పారిపోతున్నారు. ఆ పార్టీ నాయకులే ప్రతిచోటా నిలదీస్తున్నారు. దాని నుంచి దృష్టి మళ్లించడానికి మా వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఒకళ్లపై పెడితే వంద మంది ముందుకొస్తారు. కేసులకు భయపడే రోజులు పోయాయి.

- చంద్రబాబు 


అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఐడీ అధికారుల వికృత చేష్టలు పరాకాష్ఠకు  చేరాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘ఎంపీ రఘురామరాజును కస్టడీలో ఎలా కొట్టి హింసించారో రాష్ట్రం అంతా చూసింది. దానిపై కోర్టు విచారణ జరుగుతుండగానే సామాన్య సోషల్‌ మీడియా కార్యకర్తలను సీఐడీ పోలీసులు అర్ధరాత్రి ఇళ్ల మీద పడి తీసుకెళ్లి కస్టడీలో కొడుతున్నారు. కేసుల్లో ఇరుక్కున్న కొందరు పోలీసు అధికారులను గుప్పిట్లో పెట్టుకుని వారితో జగన్‌ ప్రభుత్వం ఇటువంటి తప్పుడు పనులు చేయిస్తోంది. మేమేదో మెత్తగా ఉంటామని, ఇష్టానుసారం చేద్దామనుకుంటే ఖబడ్దార్‌... తప్పు చేసిన ప్రతి అధికారి అంతు తేలుస్తాం. ప్రతి బాకీ వడ్డీతో సహా తీరుస్తాం’ అని హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ కార్యాలయంలో పనిచేసే సాంబశివరావు, సోషల్‌ మీడియా కార్యకర్త వెంకటేశ్‌లను సీఐడీ పోలీసులు తీసుకెళ్లి కొట్టడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తాము ఒక రాజకీయ పార్టీ తప్పిదాలపై పోరాటం చేస్తుంటే పోలీసు అధికారులు ఎందుకింత ఓవరాక్షన్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ‘మీరు మనుషులా.. పశువులా? ఒక తల్లి బెడ్‌రూంలో చంటి పిల్లాడికి పాలిస్తుంటే ఆ గదిలోకి కూడా చొరబడి సాంబశివరావును లాక్కెళ్లారు. కస్టడీలో విచారణ పేరుతో కొట్టారు. కులం కాపు అని చెబితే.. ఆ కులంలో ఉండి టీడీపీ కోసం ఎందుకు పనిచేస్తున్నావని తిట్టారు. పోలీసు అధికారులకు కులంతో ఏం పని? వాళ్లు ఉద్యోగం చేస్తున్నారా లేక అధికార పార్టీలో పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో ఒక పోస్టు ఫార్వర్డ్‌ చేశాడని వెంకటేశ్‌ ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్లి లైట్లు పగలగొట్టి తలుపులు విరగ్గొట్టి తీసుకెళ్లారు. ఆయన చేసిన నేరమేంటి? వివేకానందరెడ్డి హత్య జరిగిన మర్నాడు జగన్‌రెడ్డి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆ హత్య నేనే చేసినట్లుగా పెద్ద కఽథనం రాశారు. మరి ఆ పత్రికకు యజమానిగా ఉన్న భారతి ఇంటిపైకి వెళ్లి ఇలాగే లాక్కొచ్చి కేసులు పెడతారా? ది గ్రేట్‌ సీఐడీ, డీజీపీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.


ఆ సీఐపై అత్యాచారం కేసు: వెంకటేశ్‌కు 41ఏ నిబంధన కింద నోటీసు ఇవ్వడానికి వెళ్లామని పోలీసులు చెబుతున్నారని, దానికి అర్ధరాత్రి ఇంటి గోడలు దూకి లోపలికి వెళ్తారా అని చంద్రబాబు నిలదీశారు. వెంకటేశ్‌ను కస్టడీలో విపరీతంగా కొడితే అతడి ఎముకలు విరిగాయి. ఇప్పుడు మెడికల్‌ రిపోర్టులు తారుమారు చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అతడి ఇంటిపైకి అర్ధరాత్రి వెళ్లిన జగదీశ్‌ అనే సీఐపై మహిళలపై అత్యాచారం చేసిన కేసు ఉంది. ఇలాంటి అధికారులను మేం వదిలిపెట్టం. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ అనే దళితుడిని కిరాతకంగా కొట్టి ప్రాణాలు తీశారు. దీని గురించి చెబితే పరువు తీస్తామని భార్యను బెదిరించారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని దహనం చేయించారు. ఇటువంటి సమాచారం మా కార్యాలయంలో పనిచేసేవారికి వస్తుంటుంది. వారు మాకు చెబుతుంటారు. ఒక రాజకీయ పార్టీగా ఎవరికి అన్యాయం జరిగినా మేం స్పందించి పనిచేస్తాం. దీనికి మా కార్యాలయంలో పనిచేసేవారిని పట్టుకుని కొడతారా? టీడీపీ కార్యకర్తలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి మీ ఇంటికి వస్తే పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వండి. పార్టీ నేతలు, న్యాయవాదులు మీ కోసం వచ్చి నిలబడతారు’ అని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి రావడానికి ఒక ఎంపీ కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని, రేపు ఇదే పరిస్థితి తమకు వస్తే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి, మంత్రులు ఆలోచించుకోవాలన్నారు. పోలీసు కస్టడీలో దెబ్బలు తిన్న సాంబశివరావు కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బూతులు తిడుతూ తనను ఇంట్లో నుంచి లాక్కెళ్లారని, కస్టడీలో తీవ్రంగా కొట్టారని తెలిపారు.  సీఐ జగదీశ్‌ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై వీడియోలను ప్రదర్శించారు. వెంకటేశ్‌ ఇంట్లో పోలీసుల తీరుపైనా వీడియోలు చూపించారు. 

Updated Date - 2022-07-02T07:40:21+05:30 IST