ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-29T05:25:27+05:30 IST

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు జిల్లా అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ తాజాగా గురువారం అక్రమ రవాణాను స్వయంగా అడ్డుకుంది.

ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ ఆగ్రహం
ఇసుక లారీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు

 తుమ్మికాపల్లి గ్రామం వద్ద తవ్వకాలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే, శ్రేణులు
 ఎక్సకవేటర్‌ డ్రైవర్‌ పరారీ
 బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు
 ఆలస్యంగా చేరుకున్న  పోలీసులు

గజపతినగరం, జూలై 28:
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు జిల్లా అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ తాజాగా గురువారం అక్రమ రవాణాను స్వయంగా అడ్డుకుంది. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు చంపావతి నదిలోకి వెళ్లి ఇసుకను తోడుతున్న ఎక్సకవేటర్‌ను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తుమ్మికాపల్లి గ్రామం వద్ద చంపావతి నది నుంచి అక్రమంగా లారీలతో ఇసుక తరలి స్తున్నట్లు టీడీపీ కార్యకర్తలకు తెలిసింది. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కార్యకర్తలు, నాయకులను వెంట బెట్టుకుని గురువారం మధ్యా హ్నం తుమ్మికాపల్లికి చేరుకున్నారు. నది  నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. ఇసుకను తోడుతున్న ఎక్సకవేటర్‌, లారీని అడ్డుకున్నారు. వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. అనంతరం కేఏ నాయుడు తవ్వకాలపై పోలీసులకు, మైనింగ్‌ అధికారులకు సమాచారం అందజేశారు. మైనింగ్‌ అధికారులు పట్టించుకోలేదు. అధికార పార్టీ నేత ఒత్తిడే కారణమని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.  మండల కేంద్రంలో ఉన్న పోలీసులు మాత్రం మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో వచ్చి పరిశీలించారు. ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజ్‌ లారీని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేఏ నాయుడు మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలించడం అన్యాయమన్నారు.  ఇటీవల కలెక్టర్‌ స్పందనలో ఫిర్యాదు చేశామని, ఆ తర్వాత మైనింగ్‌ అధికారులు నది వద్దకు వచ్చి అక్రమాలు జరిగినట్లు గుర్తించారని, అయినా ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అండదండలతో పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. అక్కడున్నది మంత్రి బొత్స కుటుంబానికి చెందిన లారీ అని సిబ్బంది చెబుతున్నారని, విద్యాశాఖ మంత్రికి చెందిన లారీలోనే ఎమ్మెల్యే ఇసుకను తరలించడం శోచనీయమన్నారు. చంపావతిలో 20నుంచి 30 అడుగుల లోతు వరకు ఇసుకను తోడేస్తున్నారని, దీంతో భారీ గోతులు ఏర్పడి ప్రమాదాలకు కారణమవు తున్నాయన్నారు. ఆరు నెలల కిందట  కొత్తవలస గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు తుమ్మికాపల్లి వద్ద చంపావతిలో పడి  మృతిచెందారని గుర్తు చేశారు. తవ్వకాలను అడ్డుకున్న వారిలో గజపతినగరం, గంట్యాడ టీడీపీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మునాయుడు, కొండపల్లి భాస్కరరావు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, సీనియర్‌ నాయకులు పీవీవీ గోపాలరాజు తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-07-29T05:25:27+05:30 IST