రైతుల తిరుగుబాటు తప్పదు

ABN , First Publish Date - 2020-11-29T05:16:59+05:30 IST

వర్షాలతో రైతులు మూడు దఫాలుగా దెబ్బతిన్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని, ఇలా అయితే రైతుల తిరుగుబాటు తప్పదని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ హెచ్చరించారు.

రైతుల తిరుగుబాటు తప్పదు
చిన్నవంగలిలో జొన్న పంటను పరిశీలిస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

  1.   ఎకరాకు రూ.50 వేల పరిహారం ప్రకటించాలి 
  2.   టీడీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ


చాగలమర్రి/రుద్రవరం, నవంబరు 28: వర్షాలతో రైతులు మూడు దఫాలుగా దెబ్బతిన్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని, ఇలా అయితే రైతుల తిరుగుబాటు తప్పదని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ హెచ్చరించారు. శనివారం చాగలమర్రి, రుద్రవరం మండలాల్లో పర్యటించారు. నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరో 2 వారాల్లో అధికారులు నష్టపరిహారం అందించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా ఆందోళన చేపడతామని అన్నారు. రాష్ట్రంలో రైతులు బాగుపడాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. మూడోసారి పంట నష్టం జరిగినా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి వరదల సమయంలో నంద్యాల ప్రాంతానికి వచ్చి రైతులకు హామీ ఇచ్చినా నేటికీ న్యాయం జరగలేదని విమర్శించారు. కడప జిల్లాలో అరటి రైతులకు నష్టపరిహారం ఇచ్చారని, కర్నూలు జిల్లా రైతులను విస్మరించారని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటి వరకు 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. వారి కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కేవలం గ్రామాల్లో తిరిగి హామీలు ఇచ్చి సరిపెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మస్తాన్‌వలి, న్యాయవాది నరసింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు రామగురివిరెడ్డి, చాంద్‌బాషా, మాజీ సర్పంచ్‌ అన్సర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

పరిహారం ఏదీ?

రాష్ట్రంలో నివర్‌ తుఫాన్‌ ధాటికి రైతులు విలవిలలాడుతుంటే ప్రభుత్వం పరిహారం ఇవ్వదల్చుకోలేదని భూమా అఖిలప్రియ విమర్శించారు. మాట్లా డుతూ తుఫాను విధ్వంసం గురించి సీఎం, మంత్రులు కేబినెట్‌లో మాట్లాడుకొని సరి పెట్టారని విమర్శించారు. రాయలసీమలో 4 సార్లు వరదలు వస్తే ప్రభుత్వం ఇంత వరకు ఒక్కరూపాయి కూడా నష్టపరిహారం రైతులకు అందించలేదన్నారు. ఈ ప్రభుత్వంపై రైతుల్లో నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వం ఆదుకోక పోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని అన్నారు. పంట నష్టపోయిన రైతుల జాబితా తయారు చేసి నష్టపరిహారం ఇవ్వడంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అన్నారు. ఒక పార్టీ వారికే నష్టపరిహారం అందించాలని ఒత్తిడి తేవడం సిగ్గుచేటని అన్నారు. ఆళ్లగడ్డలో ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఉన్నారని, అయితే వారు రైతులను ఆదుకోవడం లేదని, వారికి ఆ పదవులు ఎందుకని ప్రశ్నించారు. రెండు వారాల గడువు ఇస్తున్నాం.. ఈ లోగా రైతుల కు నష్టపరిహారం అందించాలన్నారు. లేకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. తుఫాన్‌లో నష్టపోయిన పంట దిగుబడులు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వరికి క్వింటాలుకు రూ.2 వేలు ఇవ్వాలని అన్నారు. 

మొక్కజొన్నలు కొనుగోలు ఆర్భాటమేనా..

ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు విషయంలో ఆర్భాటం తప్ప సక్రమంగా ఏర్పాటు చేయలేదని అఖిలప్రియ విమర్శించారు. మొక్కజొన్నల కొనుగోలు కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎల్‌వి రంగనాయకులు, టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌లు జంగా పెద్దపుల్లారెడ్డి, ఎర్రం ప్రతా్‌పరెడ్డి, లక్ష్మీకాంత్‌, బండారు బాలరాజు పాల్గొన్నారు. 


 పరిహారం అందించాలి: మాజీ ఎమ్మెల్యే బీసీ   

కోవెలకుంట్ల, నవంబరు 28: గత రెండు రోజులుగా నివర్‌ తుఫాను వల్ల  పంటలు   పూర్తిగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కోవెలకుంట్ల మండలంలోని  గుళ్లదుర్తి గ్రామానికి వచ్చి గ్రామ రైతులతో కలిసి దెబ్బతిన్న వరి, శనగ, మిరప పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ డిసెంబరు 30వ తేదీ లోగా రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. పార్టీలకతీతంగా పంట నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి సర్వే చేయించి పరిహారం అందేలా చూడాలన్నారు.  గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిరాశ్రయులకు రూ.2వేలు ప్రకటిస్తే రూ.5వేలు ఇవ్వాలని జగన్మోహన్‌రెడ్డి అప్పట్లో డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన   కేవలం రూ.500 మాత్రమే ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అమడాల మద్దిలేటి, బీవీ ప్రసాద్‌రెడ్డి, సౌదరదిన్నె రామసుబ్బారెడ్డి, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి, కోవెలకుంట్ల సొసైటీ మాజీ చైర్మన్‌ గువ్వల సుబ్బారెడ్డి, రేవనూరు ఏవీ సుబ్బారెడ్డి, వల్లంపాడు జగదీశ్వరరెడ్డి  పాల్గొన్నారు.      

Updated Date - 2020-11-29T05:16:59+05:30 IST