మాట తప్పారు.. మడమ తిప్పారు!

ABN , First Publish Date - 2020-11-25T04:59:50+05:30 IST

ఎన్నికల సమయంలో అధికారంలో వస్తే పేదలకు ఉచితంగా టిడ్కో ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శించారు.

మాట తప్పారు.. మడమ తిప్పారు!
కోటంరెడ్డి ఇంట్లో బీద రవిచంద్ర, అజీజ్‌ తదితరులు

 ఇళ్లన్నీ ఉచితమని పేదలను మోసం చేస్తున్న ప్రభుత్వం

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర

 నగరంలో కోటంరెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు

 

నెల్లూరు(ఆంధ్రజ్యోతి), నవంబరు 24 :   ఎన్నికల సమయంలో అధికారంలో వస్తే పేదలకు ఉచితంగా టిడ్కో ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శించారు. ఒక రకం ఇళ్లు మాత్రమే ఉచితం అంటూ పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇంటి రుణం భారం కాకూడదని, రుణం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, నాడు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రకటించారని బీద గుర్తు చేశారు. చంద్రబాబు నిర్మించిన హౌస్‌ ఫర్‌ ఆల్‌ ఇళ్లు అన్నింటినీ పేదలకు ఉచితంగా అందజేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నగర ఇన్‌చార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మంగళవారం నిరసన చేపట్టారు. నెల్లూరులోని తన నివాసంలో రెండు గంటల పాటు లబ్ధిదారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ  వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇచ్చిన ఇళ్లను వెనక్కు తీసుకొని ఒకటన్నర సంవత్సరం వృథా చేశారని దుయ్యబట్టారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎన్టీఆర్‌ నగర్‌ను వైఎ్‌సఆర్‌ నగర్‌గా మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ ఎప్పుడూ పేర్ల మార్పు గురించి ఆలోచించలేదని, పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేశామని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను గతంలోని లబ్ధిదారులకు అందజేయాలని, మిగిలిన నిర్మాణాలను కూడా పూర్తి చేసి పేదలకు ఉచితంగా ఇళ్లను అందించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి చేతగాకపోతే తాము పేదలకు అందించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. అనంతరం నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అజీజ్‌, కోటంరెడ్డిలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, పనబాక భూలక్ష్మి, పడవల కృష్ణమూర్తి, సత్యనాగేశ్వరరావు, ఖాజావళి తదితరులు పాల్గొన్నారు.

 అన్ని డివిజన్లలో నిరసనలు

కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పిలుపు మేరకు నగర నియోజకవర్గంలోని 28 డివిజన్లలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. లబ్ధిదారులతో కలిసి నిరసనలు చేయడంతోపాటు పేదలకు అన్ని రకాల ఇళ్లను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 47వ డివిజన్లో నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ కార్పొరేటర్‌ ధర్మవరం సుజాతారావు పాల్గొన్నారు. 4వ డివిజన్లో మాజీ కార్పొరేటర్‌ మామిడాల మధు, 43వ డివిజన్లో నగర మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు పఠాన్‌ సాబీర్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.  



Updated Date - 2020-11-25T04:59:50+05:30 IST