టీసీఎస్‌ లాభం రూ.9,246 కోట్లు

ABN , First Publish Date - 2021-04-13T07:11:43+05:30 IST

దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ టీసీఎస్‌ 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.9,246 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆర్జించిన లాభం రూ.8049 కోట్లతో పోల్చితే ఇది

టీసీఎస్‌ లాభం రూ.9,246 కోట్లు

క్యూ4లో 15 శాతం వృద్ధి

ఒక్కో  షేరుపై తుది డివిడెండు రూ.15 


న్యూఢిల్లీ: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ టీసీఎస్‌ 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.9,246 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆర్జించిన లాభం రూ.8049 కోట్లతో పోల్చితే ఇది 14.9 శాతం అధికం. ఇదే కాలంలో ఆదాయం 9.4 శాతం వృద్ధితో రూ. 39,946 కోట్ల నుంచి రూ.43,705 కోట్లకు పెరిగింది. ఇదిలా ఉండగా మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కంపెనీ రూ.33,388 కోట్ల నికరలాభం (న్యాయపరమైన క్లెయిమ్‌లకు కేటాయింపులు మినహాయించగా) ఆర్జించింది. అది మినహాయిస్తే నికర లాభం రూ.32,430 కోట్లని టీసీఎస్‌ ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం లాభం రూ.32,340 కోట్లు. ఎపిక్‌ సిస్టమ్స్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన కేసులో రూ.1,218 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. సంవత్సరాదాయం 4.6 శాతం పెరిగి రూ.1,56,949 నుంచి  రూ.1,64,177 కోట్లకు చేరుకుంది. ఒక్కో షేరుపై రూ.15 తుది డివిడెండును కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. 


కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోయిన ఏడాదిలో కూడా మూడు త్రైమాసికాలు నిలకడగా మంచి పనితీరు ప్రదర్శించడం వల్ల ఏడాది మొత్తంలో బలమైన వృద్ధి సాధించగలిగామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వీ రామకృష్ణన్‌ అన్నారు. తమ వృద్ధి అజెండాకు దోహదపడే విభాగాల్లో క్లయింట్ల సంఖ్య పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించనున్నట్టు సీఈఓ రాజేశ్‌ గోపీనాథన్‌ ఈ సందర్భంగా చెప్పారు. మెగా డీల్స్‌ సాధించడంతో పాటు పరిశ్రమలోనే అగ్రగామిగా నిలవగల వృద్ధి నమోదు చేయడం సాధ్యమేనన్న తమ బలమైన నమ్మకానికి క్యూ4 మార్జిన్లు దర్పణమని రామకృష్ణన్‌ అన్నారు.  


920 కోట్ల డాలర్ల ఆర్డర్లు: నాలుగో త్రైమాసికంలో టీసీఎస్‌ 920 కోట్ల డాలర్ల టీసీవీ (మొత్తం కాంట్రాక్టు విలువ) సాధించింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఆర్డర్ల గరిష్ఠ స్థాయి ఇదే. ఏడాది మొత్తం మీద టీసీఎస్‌ కాంట్రాక్టు విలువ 3160 కోట్ల డాలర్లు. 2019-20తో పోల్చితే ఆర్డర్లు 17.1 శాతం పెరిగాయి.  


19388 నియామకాలు : నాలుగో త్రైమాసికంలో టీసీఎస్‌ 19,388 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఒక త్రైమాసికంలో కంపెనీ గరిష్ఠ నియామకాల సంఖ్య కూడా ఇదే. దీంతో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 4,88,649కి చేరింది. మరోవైపు ఉద్యోగుల వలస (అట్రిషన్‌) 7.2 శాతంగా ఉంది. 

Updated Date - 2021-04-13T07:11:43+05:30 IST