TCS, Infosys: విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-10-15T21:55:00+05:30 IST

ఇండియన్ ఐటీ సర్వీసెస్ ప్రొవైడర్స్ విద్యుత్తు కొరతను అధిగమించేందుకు

TCS, Infosys: విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు సన్నాహాలు

న్యూఢిల్లీ : ఇండియన్ ఐటీ సర్వీసెస్ ప్రొవైడర్స్ విద్యుత్తు కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. బొగ్గు నిల్వలు తగ్గిపోయినట్లు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారమవడంతో కీలక ప్రాజెక్టులకు అంతరాయం కలగకుండా పవర్ బ్యాక్‌అప్ చేయాలని ఉద్యోగులను కోరాయి. అయితే బొగ్గు కొరత సమస్య కొంత వరకు పరిష్కారమవుతున్నట్లు కనిపిస్తోంది.


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ తమ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఈ-మెయిల్స్ ద్వారా అప్రమత్తం చేశాయి. విద్యుత్తు లోడ్ షెడ్డింగ్ కొనసాగితే, సత్వరమే హెచ్చరికలు జారీ చేయాలని, విద్యుత్తు సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు ఎలక్ట్రిసిటీ బ్యాక్అప్ ప్లాన్స్‌ను సిద్ధం చేయాలని కోరాయి. 


మన దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో సుమారు 90 శాతం మంది గత ఏడాది మార్చి నుంచి ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయాలన్న లక్ష్యంతో ఐటీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 


పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు గత కొద్ది రోజుల్లో లోడ్ షెడ్డింగ్ చేశాయి. అయితే బొగ్గు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి ఆలోక్ కుమార్ ఇటీవల మాట్లాడుతూ, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద బొగ్గు నిల్వల తగ్గుదల వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగే సందర్భాలు కేవలం 1 శాతం కన్నా తక్కువ అని తెలిపారు. 


ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం ప్రకారం, టీసీఎస్ బిజినెస్ కంటిన్యుయిటీ ప్లాన్స్‌ను సిద్ధం చేసింది. బొగ్గు నిల్వలు తగ్గడం వల్ల విద్యుత్తు సరఫరాపై పడే ప్రభావం గురించి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు తెలిపింది. క్రింది స్థాయి ఉద్యోగులు నిర్వహించే ప్రాజెక్టులపై విద్యుత్తు కోతల ప్రభావం పడే అవకాశం ఉంటే, వెంటనే వారిని అప్రమత్తం చేయాలని తెలిపింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ కూడా వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. పవర్ బ్యాక్అప్ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ గత వారం ఉద్యోగులకు తెలిపింది. విద్యుత్తు సరఫరా ఇబ్బందికరంగా మారితే, ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించి, పని చేయించాలని కూడా నిర్ణయించింది.


Updated Date - 2021-10-15T21:55:00+05:30 IST