ఇంటర్నెట్ డెస్క్: అత్యంత ప్రజాదరణ పొందిన పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ రెండో దశ అమలు బాధ్యతలను ప్రభుత్వం ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్‌కు అప్పగించింది. ఈ డీల్ విలువ ఎంతనేది టీసీఎస్ ప్రకటించకపోయినప్పటికీ.. ఈ కాంట్రాక్ట్ విలువ ఏకంగా ఆరు వేల కోట్లు ఉండొచ్చని సమాచారం. పాస్‌పోర్టు సంబంధిత సేవలను మరింత సమర్థవంతంగా, ప్రజలకు సులువుగా చేరేలా అమలు చేసేందుకు ప్రభుత్వం 2008లో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీలైనంత తక్కువ సమయంలో, అత్యంత పారదర్శకంగా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం తీసుకొచ్చింది. అయితే.. ప్రస్తుతమున్న కేంద్రాల్లో ప్రపంచస్థాయి సేవలు అందుతుండటంతో వీటిపై ప్రజల్లో సదభిప్రాయం నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండో విడత అమలు బాధ్యతలను టీసీఎస్‌కు అప్పగించింది. ఈ విడతలో టీసీఎస్ ప్రస్తుతమున్న కేంద్రాలను మరింత మెురుగు పరచడంతో పాటూ ఈ పాస్‌పోర్టుల జారీకి సంబంధించి మరిన్ని నూతన విధానాలను అందుబాటులోకి తెస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది.