Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘చెత్త’ బాదుడు..

  • నగరవాసికి మరో పన్ను 
  • ప్రతి కుటుంబం నుంచీ నెలకు రూ.120 వసూలు
  • చిరువ్యాపారులు నెలకు రూ.300 చెల్లించాలి
  • మురికివాడలో ఉన్నా రూ.30 కట్టాల్సిందే
  • 7వ తేదీ దాటితే రూ.15 జరిమానా
  • చెత్త పన్నుపై ఆదాయం ఏడాదికి రూ.90కోట్లు


తమను ఎన్నుకున్న ప్రజలకు ‘భారాల’ బతుకును వరంగా ఇస్తున్నారు నగర పాలకులు. సొంత గూడు ఉంటే ఆస్తి ఆధారిత పన్ను.. చుట్టూ పేరుకున్న చెత్త పారేయాలంటే చెత్త పన్ను.. విద్యుత్‌ను వినియోగించుకుంటున్నందుకు ట్రూఅప్‌ చార్జీలు.. కాదేదీ పన్నుకనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సేవలందించాల్సిన నగర పాలక సంస్థ కార్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా, సచివాలయాలను పన్నుల వసూలు కేంద్రాలుగా మార్చేశారు. ఒకపక్క ఆస్తి ఆధారిత ఇంటి పన్ను పెంచుతూ నోటీసులు సిద్ధం చేస్తున్న నగర పాలకులు.. మరోపక్క ‘ఇంటింటికీ చెత్త బాదుడు’ను మొదలెట్టేశారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సామాన్యుడి బతుకు భారం చేసేలా అన్నింటిపై పన్నులు వేస్తూ వైసీపీ సర్కార్‌ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని నివాసగృహాల నుంచి ఈ ఏడాది అక్టోబరు నుంచి చెత్త పన్ను పేరిట వీఎంసీ అధికారులు వసూళ్లు ప్రారంభించారు. ఏడాదికి రూ.90 కోట్ల ఆదాయాన్ని చెత్త పన్ను ద్వారా సేకరించాలన్నది వీఎంసీ లక్ష్యం. దీనిపై ప్రజలు, పౌరసంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ 2016ను అనుసరించి ఈ ఏడాది జూన్‌ నుంచి వీఎంసీ పరిధిలోని ఆరు మోడల్‌ వార్డుల నుంచి చెత్త పన్ను వసూలును ప్రారంభించారు. అక్టోబరు నుంచి మిగిలిన అన్ని వార్డుల్లోనూ వసూళ్లు మొదలుపెట్టారు. వీఎంసీ పరిధిలో సుమారు 3.20 లక్షల గృహసముదాయాలు ఉన్నాయి. వీటిలో 1.20 గృహాలు నాన్‌- స్లమ్‌ ఏరియాలో ఉండగా స్లమ్‌ ఏరియాలో సుమారు లక్ష గృహాలు ఉన్నాయి. ఇవికాకుండా మరో లక్ష సముదాయాలు కమర్షియల్‌ విభాగం కింద ఉన్నాయి. ఒక నివాసంలో మూడు పోర్షన్లు ఉంటే వాటిలో నివసించే మూడు కుటుంబాల వారూ ప్రతి నెలా చెత్త పన్ను చెల్లించాలి. ఆలస్యమైతే పెనాల్టీ రూ.15 వేస్తారు. తడి..పొడి చెత్త వేరు చేయకపోతే దానికీ రూ.100 అదనంగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. చెత్త పన్ను ఏడాదికి ఐదు శాతానికి తగ్గకుండా పెరుగుతూనే ఉంటుంది.


వరుస బాదుడు

మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ ప్రభుత్వం పన్ను బాదుడుకు సిద్ధమైపోయింది. ఆస్తి పన్ను పెంపునకు జీవో నంబరు 198 జారీ చేయగా, ప్రతి సంవత్సరం మంచినీరు, డ్రైనేజీ చార్జీలు పెంచడానికి జీవో నంబరు 196, 197 తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే చెత్త పన్ను బాదుడు ప్రారంభించారు. వీఎంసీ పరిధిలోని 2.20 లక్షల గృహ సముదాయాల నుంచి నెలకు రూ.కోటిన్నర నుంచి 2 కోట్ల వరకు చెత్త పన్ను సేకరించనున్నారు. అలాగే కమర్షియల్‌ విభాగంలో ఉన్న లక్ష గృహ సముదాయాల నుంచి రూ.5 నుంచి 6 కోట్ల మేర ఆదాయాన్ని సమీకరించనున్నారు. మురికివాడల్లో నివసించే నిరుపేదలు మొదలు రోడ్డు పక్కన చిన్న దుకాణాలు పెట్టుకుని జీవించే వారి వరకు ఎవరినీ వదలకుండా ‘చెత్త’ భారం మోపారు.


చెత్త పన్ను వసూలు ఇలా..

నివాసగృహాలు (నాన్‌-స్లమ్‌ ఏరియా) నెలకు రూ.120

నివాసగృహాలు(స్లమ్‌ ఏరియా) నెలకు రూ.30

పెద్ద రెస్టారెంట్లు/హోటళ్లకు నెలకు రూ.1500

రోడ్డుపక్క చిరు దుకాణాలకు నెలకు రూ.300

5 స్టార్‌ హోటల్స్‌కు నెలకు రూ.15వేలు

3 స్టార్‌ హోటల్స్‌కు నెలకు రూ.10వేలు

మాంసం దుకాణాలకు నెలకు రూ.300

7వ తేదీ దాటితే జరిమానా రూ.15


చెత్త పన్ను తక్షణం ఉపసంహరించుకోవాలి

ఇప్పటికే ఇంటి పన్ను పెంచి సామాన్యులపై భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెత్త పన్ను పేరుతో మరో భారాన్ని మోపుతోంది. తక్షణమే చెత్త పన్ను వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. రకరకాల పన్నుల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వం ప్రజలకు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించలేకపోతోంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాపోరాటాలు చేస్తాం. - సీహెచ్‌.బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు


చెత్త పన్ను ఎవరూ చెల్లించొద్దు

చెత్త పన్ను ఎవరూ చెల్లించవద్దు. పన్ను వసూళ్లకు వ్యతిరేకంగా అన్ని పార్టీల సమావేశానికి పిలుపునిచ్చాం. చెత్త పన్నుతో పాటు పెంచిన ఆస్తి పన్నును కూడా చెల్లించవద్దు. ప్రభుత్వం పెంచిన చెత్త, ఆస్తి పన్నులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేకుంటే ప్రజలే తిరగబడతారు. - దోనేపూడి శంకర్‌, సీపీఐ నగర కార్యదర్శి


అవి అక్రమ వసూళ్లు

చెత్త పన్ను పేరుతో వలంటీర్లతో డబ్బులు వసూళ్లు చేయించడం అక్రమం. ప్రజల నుంచి ఏదో ఒక విధంగా డబ్బులు దండుకోవాలన్న ఉద్దేశంతోనే చెత్త పన్ను వసూళ్లకు ప్రభుత్వం పూనుకుంది. తక్షణమే ఈ వసూళ్లను నిలిపివేయాలి. లేకుంటే భవిష్యత్తులో ప్రజా ఉద్యమం తప్పదు. - నవనీతం సాంబశివరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 


ఇవి అప్పుల భారాలు

ముఖ్యమంత్రి కాబూలీవాలాలా తయారై ప్రజల రక్తం పీలుస్తున్నారు. లెక్కకుమించి అప్పులు చేసి, వాటిని తీర్చడానికి ప్రజల మీద భారాలు వేస్తూ ఆర్థికంగా కుంగదీస్తున్నారు. - కంచి దుర్గ, కార్పొరేటర్‌, 60వ డివిజన్‌ 


వడ్డీతో సహా వసూళ్లు

పథకాల పేరుతో డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, పన్నుల ద్వారా వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. పథకాలు అందరికీ అందక పోయినా, పన్నులు మాత్రం ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. - దుర్గారావు, వాంబేకాలని 

Advertisement
Advertisement