పన్నులు ‘డౌన్‌’

ABN , First Publish Date - 2020-05-25T11:11:27+05:30 IST

నగరపాలక, పురపాలక సంస్థల్లో పన్నుల వసూళ్లు మందగించింది.

పన్నులు ‘డౌన్‌’

వసూళ్లకు  కరోనా బ్రేక్‌

వైరస్‌ కట్టడి విధుల్లో రెవెన్యూ సిబ్బంది 

ఫలితం చూపని రాయితీ విధానం 

నెలాఖరుతో ముగియనున్న గడువు 

మున్సిపాలిటీల ఖజానాలు ఖాళీ


ఒంగోలు (కార్పొరేషన్‌ ) మే 24 : నగరపాలక, పురపాలక సంస్థల్లో పన్నుల వసూళ్లు మందగించింది. ఆస్తి, నీటి పన్ను బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి.  దీంతో ఖాజానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏటా మార్చి 31 నాటికి ముగించాల్సిన ఆస్తి, తాగునీటి పన్నుల వసూళ్లపై కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. మార్చి 24 నుంచి అంతటా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో వసూళ్లకు బ్రేక్‌ పడింది.  పన్నుల వసూళ్లలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ యంత్రాంగమైన ఆర్వో, ఆర్‌ఐలు, బిల్‌ కలెక్టర్లకు కరోనా నియంత్రణ సేవలకు కేటాయించడంతో మరింత  వెనుకబడింది. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లలో పురోగతి సాధించేందుకు ప్రభుత్వం రాయితీ విధానం అమలు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ముందే పన్నులు చెల్లిస్తే 5 శాతం వడ్డీ మినహాయింపు ఇచ్చింది. అయినప్పటికీ  ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాలోని ఒంగోలు నగర పాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలు కలిపి మొత్తం 1,54,060 అసె్‌సమెంట్‌లకు పన్ను వసూళ్ల డిమాండ్‌ రూ. 95 కోట్లు ఉంది. అందులో 73శాతం మాత్రమే వసూలు చేశారు. ఈ నెలాఖరుతో వసూళ్ల గడువు ముగియనుంది. 


బోసిపోతున్న ఖజానాలు 

 అభివృద్ధి పనులకు ఆయా మునిసిపాలిటీల సాధారణ నిధులు (జనరల్‌ ఫండ్‌)లనే అధిక శాతం ఉపయోగించాల్సి ఉంది. వాటితో తాగునీటి నిర్వహణ, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు, పలు అభివృద్ధి పనులు చేపట్టాలి. విద్యుత్‌ దీపాల నిర్వహణ, విద్యుత్‌ బకాయిలతోపాటు పార్కుల నిర్వహణ, పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపు ఇతరత్రాకొన్ని ఆర్థికపరమైన అవసరాలకు జనరల్‌  నిధులనే వినియోగించాల్సి ఉంది. అయితే ఈసారి పురపాలక సంఘాల ఖజానాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. 

Updated Date - 2020-05-25T11:11:27+05:30 IST