వ్యవసాయంపై పన్ను

ABN , First Publish Date - 2021-02-09T06:36:29+05:30 IST

నాలుగు వర్ధమానదేశాలలో వ్యవసాయ పన్ను విధానాన్ని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) అధ్యయనం చేసింది....

వ్యవసాయంపై పన్ను

నాలుగు వర్ధమానదేశాలలో వ్యవసాయ పన్ను విధానాన్ని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) అధ్యయనం చేసింది. కెన్యాలో 2018 నుంచి సంపన్న వ్యవసాయదారులపై ఆదాయపు పన్ను విధిస్తున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది. కెమరూన్‌లో ఇతర పన్ను చెల్లింపుదారుల వలే వ్యవసాయదారులు కూడా ఆదాయపు పన్ను చెల్లించవలసిందే (వాస్తవానికి రైతుల నుంచి ఈ పన్నును వసూలు చేయడం లేదు). వ్యవసాయంపై ఆదాయపు పన్నును విధించే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ 1997లో పాకిస్థాన్‌లో చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం పాక్ పంజాబ్‌లో పన్నెండున్నర ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న లేదా 80 వేల పాకిస్థానీ రూపాయల ఆదాయం ఉన్న రైతులు ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. 


మనదేశంలో వ్యవసాయ ఆదాయాలపై పన్ను చెల్లించనవసరం లేదు. ఈ వెసులుబాటు కారణంగా వ్యవసాయ ఆదాయానికి గాను కావేరీ సీడ్స్ రూ.186 కోట్లు, మోన్సాంటో ఇండియా రూ.94 కోట్లు పన్ను మినహాయింపు పొం దాయి. ఇటువంటి పన్ను మినహాయింపు వల్ల మనకు ఆహారభద్రత సమకూరదు. ఎందుకంటే ఆ మినహాయింపు పొందిన సంస్థలు ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసేవికావు. వ్యవసాయదారులపై ఆదాయపు పన్ను విధించినా మన ఆహారభద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లదు. పైగా వ్యవసాయ ఆదాయాలపై పన్ను విధింపు ద్వారా లభించే రాబడి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. వ్యవసాయ ఆదాయపు పన్ను ద్వారా రూ.3 లక్షల కోట్ల రాబడి (స్థూల దేశీయోత్పత్తిలో 1.2 శాతం) లభించే అవకాశముందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. సామాజిక న్యాయసాధనకూ ఈ రాబడి తోడ్పడుతుంది. సంపన్న రైతుల నుంచి వసూలు చేసిన ఆదాయపు పన్ను రాబడిని పేదలకు ఆహార సబ్సిడీలు ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ రూ.3 లక్షల కోట్ల రాబడితో దేశపౌరులకు మరోవిధంగా కూడా లబ్ధి చేకూర్చవచ్చు. ఆ మొత్తాన్ని దేశపౌరులందరికీ ఏడాదికి రూ.2200 చొప్పున ప్రత్యక్ష బదిలీ చేయవచ్చు. కనుక నిర్దేశిత పరిమితికి మించి భూములు, ఆదాయం ఉన్న రైతుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయాలి. 


ఈ సబ్సిడీల వల్ల ఆహారధాన్యాలను సాగుచేయడం రైతులకు లాభదాయకమవుతుంది. తద్వారా మనకు ఆహారభద్రత సమకూరుతున్నది. నేడు మన ఆహారభద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లే అవకాశం లేదు. నీటిపారుదల సదుపాయాల అభివృద్ధి, అధునాతన సేద్య సాంకేతికతలు అందుబాటులోకి రావడం వల్ల 1960 దశకం నుంచి మనదేశంలో కరువుకాటకాలు సంభవించడం లేదు. ఇప్పుడు మనకు ఆహారధాన్యాల మిగులు అపారంగా ఉంది. అయితే ఆ ధాన్యరాశులను నిల్వ చేసుకోవడంలో మనం నష్టాలకు గురవుతున్నాం. అలాగే ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు వాటిని ఎగుమతి చేయడం వల్ల కూడా మనం నష్టపోతున్నాం. మరో ముఖ్యమైన వాస్తవాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ఏ సబ్సిడీలు మన ఆహారభద్రతకు దోహదం చేస్తున్నాయో అవే మరోవిధంగా మన ఆహారభద్రతకు హాని చేస్తున్నాయి. సబ్సిడీల మూలంగా రైతులు ఉత్పాదకాలను మితి మీరి వినియోగిస్తున్నారు. కాల్వల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని అవసరాలకు మించి వినియోగించుకుంటున్నారు. ఉపయోగించుకుంటున్న నీటికి ధర వసూలు చేయకపోవడం వల్ల రైతులు ఆ సహజవనరును దుర్వినియోగం చేస్తున్నారు. ఫలితంగా సాగునీటి కొరత ఏర్పడుతోంది. దీనివల్ల ఆహారభద్రతపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అదే నీటిని పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ పార్క్‌లకు సరఫరా చేస్తే పారిశ్రామిక ప్రయోజనాలు సమకూరుతాయి. మరింత అధిక ఆదాయం లభిస్తుంది. సహజ వనరులను కాపాడుకోవడానికి గాను వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేయడం శ్రేయస్కరం. 


వ్యవసాయ పన్నుల విధానంలో ప్రభుత్వం మూడు మార్పులను అమలుపరిచి తీరాలి. అవి: (1) వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై పన్ను విధించాలి. దీనివల్ల ఆర్థికాభివృద్ధికి ముప్పు లేకుండా సామాజిక న్యాయం, ఆహారభద్రత సమకూరతాయి. (2) నిర్దేశిత పరిమాణానికి మించి సాగు భూములు, ఆదాయం ఉన్న రైతుల నుంచి ఆదాయపు పన్ను వసూలు చేయాలి. దీనివల్ల ఆహారభద్రతకు విఘాతం లేకుండా సామాజిక న్యాయం సమకూరుతుంది. (3) వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేయాలి. అదే సమయంలో సామాన్యులకు నగదు బదిలీ చేయాలి. దీనివల్ల సామాజిక న్యాయానికి ఢోకా లేకుండానే ఆహారభద్రత సమకూరుతుంది. ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది.              


భరత్ ఝున్‌ఝున్‌వాలా

Read more