పన్నుపోటు!

ABN , First Publish Date - 2021-09-16T05:10:37+05:30 IST

పారిశుధ్య పనులకు అయ్యే ఖర్చును ప్రజల నుంచే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పన్నుపోటు!
నరసరావుపేట ఎన్‌జీవో కాలనీలో పేరుకుపోయిన వ్యర్ధాలు

కాసులు కురిపిస్తున్న చెత్త

మునిసిపాల్టీల్లో ముక్కు పిండి మరీ వసూలు 

ఏటా ప్రజలపై రూ.55 కోట్లకు పైగా  ఆర్థిక భారం

పట్టణాలలో కానరాని పరిశుభ్రత

పాత పద్ధతిలోనే పారిశుధ్య పనులు

పన్ను వసూలులో పారదర్శకత కరవు


  ప్రజలపై పన్నులు భారం నానాటికీ పెరుగుతోంది. దీనికి చెత్తకు పన్ను తోడైంది. చెత్తపన్ను బాదుడు పురపాలక సంఘాల్లో ప్రారంభమైంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన చెత్తపన్ను ముక్కుపిండి మరీ పురపాలక సంఘాలు వసూలు చేస్తున్నాయి. పన్ను చెల్లిస్తున్నా పారిశుధ్యం మెరుగుదల మాత్రం కనిపించడంలేదు. పన్ను వసూలుపై ఉన్న శ్రద్ధ పరిశుభ్రతపై కానరావడంలేదు. చెత్త పన్ను ద్వారా గుంటూరు కార్పొరేషన్‌ సహా మునిసిపాల్టీలు ఏడాదికి రూ.55 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించనున్నాయి. 


నరసరావుపేట, సెప్టెంబరు 15: పారిశుధ్య పనులకు అయ్యే ఖర్చును ప్రజల నుంచే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పారిశుధ్య విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త విధానం అమలు చేయక మునుపే చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాల్సిన ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటోంది. పారిశుధ్య పనులకు అయ్యే ఖర్చును ప్రజల నుంచే వసూలు చేసే ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.60 వసూలు చేస్తున్నారు. ఈ బాధ్యతలు వలంటీర్లకు అప్పగించారు. సేవా రుసుము పేరుతో రశీదులు ఇస్తున్నారు.


పన్ను వసూలులో పారదర్శకత కరవు

 చెత్త పన్ను వసూలులో పారదర్శకత కనిపించడంలేదు. మునిసిపాల్టీలు సేవా రసుము పేరుతో ముద్రించిన రశీదు పుస్తకాలను వలంటీర్లకు అప్పగిస్తున్నారు. వారు ఇంటింటికీ వెళ్లి పన్ను వసూలు చేస్తున్నారు. పక్కా రశీదు అమలు చేయడం లేదు. కనీసం రశీదుపై కమిషనర్‌ సంతకం కూడా ఉండటంలేదు. వలంటీరు సంతకంతో రశీదులు జారీ చేస్తున్నారు. ఆస్తిపన్ను తరహాలో ఆన్‌లైన్‌ విధానాన్ని చెత్త పన్ను అమలు చేయడంలేదు. అక్రమాలకు ఊతం ఇచ్చే విధంగా వసూళ్లు జరుగుతున్నాయి.


పరిశుభ్రత ప్రశ్నార్ధకమే

పన్ను వసూలు చేస్తున్న మునిసిపాల్టీలు పరిశుభ్రతపై దృష్టి సారించడంలేదు. వీధులు ఇంకా చెత్త పేరుకుపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. పారిశుధ్యం పూర్తిగా మెరుగదల చేయకముందే పన్ను వసూలు చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మురుగు కాలువలు పూడికతీతకు నోచుకోవడంలేదు. మురుగు నీరు పారుదల లేక దోమలవ్యాప్తి అధికంగా ఉంది. ప్రజలు దోమ కాటుకు గురై విషజ్వరాల బారిన  పడుతున్నారు. ఇంటింటి నుంచి పన్ను వసూలు చేసినా పారిశుధ్యం మెరుగుదల ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందాన ఉంది. 


పట్టణంలో 4.19 లక్షల గృహాలు

 పట్టణంలో 4,19,611 గృహాలు ఉన్నాయి. ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ.60 చొప్పున ఏడాదికి రూ.720 వసూలు చేస్తున్నారు. ఒక్క గుంటూరు కార్పొరేషన్‌లోనే 1,83,460 ఇళ్ళు ఉన్నాయి. దీనిలో 10 శాతంకు పైగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు. ఉన్న ఇళ్ళకు రూ.60 చొప్పున వసూలు చేస్తేనే గుంటూరు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.13 లక్షలు ఆదాయం రానున్నది. కమర్షియల్‌కు మరో రూ.3 కోట్లయినా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇలానే మునిసిపాల్టీలు చెత్త పన్ను ద్వారా ఆదాయాన్ని ఆర్జించనున్నాయి. ఇంటికి మాత్రమే నెలకు పన్ను రూ.60.  కాగా హోటళ్ళకు రూ.1,000, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు రూ.2,000, 40 పడకల ఆస్పత్రులకు రూ7,500, కల్యాణ మండపాలకు రూ.2,500 నుంచి రూ.7,500, విద్యాసంస్థలకు రూ.300 నుంచి రూ.2,000 వరకు చెత్త పన్నును అమలు చేస్తున్నారు. నూరుశాతం ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నట్టు పురపాలక సంఘాలు ప్రకటిస్తున్నా ఆచరణలో కానరావడంలేదు. పేదల గృహాలకు ఇంటి పన్ను కంటే చెత్త పన్ను అధికంగా ఉండటం పట్ల ఆఆయా వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్తిపన్నులో పారిశుధ్య పన్ను కూడా కలిసి ఉంటుంది. అయినా ప్రత్యేకంగా పన్ను వసూలు చేయడం ఏమిటని పురపౌరులు ప్రశ్నిస్తున్నా వీరి మొర ఆలకించే పాలకులే కరువయ్యారు. చెత్త పన్ను వసూలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పారిశుధ్యం పనులకు ఖర్చు చేసే మొత్తాన్ని ప్రజల నుంచే వసూలు చేస్తుండటం వలన మునిసిపాల్టీలకు నిధులు ఆదా అవుతున్నాయి. 


Updated Date - 2021-09-16T05:10:37+05:30 IST