పన్ను పోటు తప్పదు!

ABN , First Publish Date - 2022-08-15T09:33:54+05:30 IST

సగటు వేతన జీవి.. చిరు వ్యాపారి.. సాధారణ మధ్యతరగతి ప్రజలు.. ఇలా పలు వర్గాలు పూర్తిస్థాయిలో ‘పన్ను’పోటును ఎదుర్కోవాల్సిందే.

పన్ను పోటు తప్పదు!

  • మినహాయింపులకు ఇక మంగళం
  • 2020లో కొత్త పన్ను విధానం అమలు
  • పాత విధానమా? కొత్త విధానమా?
  • ఇప్పటి వరకు చెల్లింపుదారుకే ఆప్షన్‌
  • త్వరలో పాత విధానానికి స్వస్తి
  • కొత్తదాన్నే కొనసాగించనున్న సర్కారు
  • ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు


న్యూఢిల్లీ, ఆగస్టు 14: సగటు వేతన జీవి.. చిరు వ్యాపారి.. సాధారణ మధ్యతరగతి ప్రజలు.. ఇలా పలు వర్గాలు పూర్తిస్థాయిలో ‘పన్ను’పోటును ఎదుర్కోవాల్సిందే. హౌసింగ్‌లోన్‌ ఉన్నా.. విద్యా రుణానికి సంబంధించి చెల్లించే వడ్డీ భారీగా ఉంటున్నా.. హెల్త్‌స్కీమ్‌లు.. బీమా పథకాలను కొనసాగిస్తున్నా.. ఇకపై పన్ను రాయితీలు, మినహాయింపులు ఉండబోవు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తే చేస్తోందని సర్కారులోని అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 2020లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించి, వెంటనే ‘ఐచ్ఛికం’గా అమల్లోకి తెచ్చిన ‘నూతన ఆదాయపన్ను విధానం’ త్వరలో తప్పనిసరి కానుంది. నూతన ఆదాయ పన్ను విధానాన్ని ప్రకటించినప్పుడే.. కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఆప్షన్‌ ఇచ్చింది. వారికి నచ్చితేనే కొత్త విధానంలోకి మారొచ్చు. లేదంటే పాత విధానాన్నే కొనసాగించవచ్చు. ఒక్కసారి కొత్త విధానానికి మారితే.. పాత పాలసీకి తిరిగి వెళ్లలేరు. ఈ రెండిటిమధ్య ప్రధాన తేడా ఏంటంటే.. మొదటి దాంట్లో ఆదాయపన్ను ఎక్కువగా ఉన్నా.. మినహాయింపులు భారీగా ఉంటున్నాయి. కొత్త విధానంలో పన్ను రేటు తగ్గుతుందే తప్ప.. మచ్చుకైనా మినహాయింపులుండవు. 


దీంతో.. గృహరుణాలు, విద్యారుణాలు, హెల్త్‌స్కీములు, బీమా పథకాలకు డబ్బులు చెల్లిస్తున్నవారు.. స్వచ్ఛంద సంస్థలు, దేవాలయాలకు డొనేషన్లు ఇచ్చినవారు.. పాత పన్ను విధానంలో ఆదాయపన్నులో మినహాయింపులు పొందుతున్నారు. ఫలితంగా నిర్ణీత ట్యాక్స్‌ కంటే.. చాలా తక్కువ పన్ను చెల్లించి, అప్పటికే జీతంతోపాటు కట్‌ అయిన ఐటీ మొత్తాలను రిఫండ్‌ చేసుకునేలా ఉన్న వెసులుబాటును వినియోగించుకుంటున్నారు. కొత్త పద్ధతిలో అలా కాదు. పన్ను తక్కువగా ఉంటుంది. కానీ, ఎలాంటి మినహాయింపులు ఉండవు. దీంతో.. హౌసింగ్‌/ఎడ్యుకేషన్‌ లోన్లు ఉన్నవారు పాతవిధానాన్ని.. ఆయా లోన్లు పూర్తయి.. ఎలాంటి మినహాయింపులూ రానివారు.. తక్కువ పన్నులే ఉండే కొత్త విధానాన్ని ఎంచుకుంటున్నారు.


త్వరలో.. అంతా ఒక్కటే?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పలు సందర్భాల్లో పాత పన్ను విధానానికి స్వస్తిపలికే ఆలోచనలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంలోని విశ్వసనీయవర్గాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. తద్వారా.. గతంలో ఉన్న సంక్లిష్టమైన పన్ను విధానాన్ని రద్దుచేసి.. ఆకర్షణీయ పన్నులు ఉండే కొత్త విధానాన్ని మాత్రమే అమలుచేయనున్నట్లు స్పష్టమవుతోంది. 2019లో ఇదే తరహా విధానాన్ని కార్పొరేట్‌ చెల్లింపుదారులకు అమలు చేశారు. అప్పట్లో 30ు పన్నును 22శాతానికి తగ్గించారు. రాయితీలు, మినహాయింపులను రద్దుచేశారు. 2019 అక్టోబరు ఒకటో తేదీ తర్వాత ఏర్పాటై, 2025 మార్చి 31 లోగా ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించే తయారీ రంగంలోని కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను 25 శాతం నుంచి 15 శాతానికి  తగ్గించారు. ఈ కొత్త విధానంలోకి మారాలనుకునే కంపెనీలు గతంలో అమలులో ఉన్న మినహాయింపులు, ప్రోత్సాహకాలన్నీ వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు సాంతం కొత్తపద్ధతేసాగుతోంది. ఆదాయపన్ను చెల్లింపుల విషయంలోనూ మినహాయింపులు, కోతలకు తావులేని విధానాన్ని అమలు చేసే దిశలో కేంద్ర కసరత్తు చేస్తోందని విశ్వసనీయవర్గాలు స్పష్టం చేశాయి.



Updated Date - 2022-08-15T09:33:54+05:30 IST